మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం.. ఇడమయ్యకు దాతల చేయూత

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

రూ.22 వేల ఆర్థిక సాయం అందజేత

కృత్రిమ కాలు ఏర్పాటు కోసం ముందుకొచ్చిన సామాజికవేత్త

నేటి సూర్య ప్రతినిధి : కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలబడటమే నిజమైన మానవత్వమని మరోసారి నిరూపించారు పలువురు దాతలు. చర్ల మండలంలోని  మారుమూ ల గ్రామమైన బక్క చింతలపాడుకు చెందిన ఇడమయ్య దయనీయ పరిస్థితిపై స్పందించిన దాతలు ఆయనకు ఆర్థిక సహాయం అందించి తమ పెద్ద మనసును చాటుకున్నారు.

రెండు కాళ్లు కోల్పోయి, చేతులు కూడా సరిగా పనిచేయని పరిస్థితుల్లో జీవన పోరాటం సాగిస్తున్న ఇడమయ్య కుటుంబం గురించి తెలిసిన పలువురు దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించారు. హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కాముని శివరామకృష్ణ రూ.10,000, హైకోర్టు న్యాయవాది సిహెచ్ సతీష్ కుమార్ రూ.5,000, టీవీ9 రిపోర్టర్ అనిల్ రెడ్డి రూ.5,000, ఎడారి భూపతి రూ.2,000 చొప్పున మొత్తం రూ.22,000 నగదు సహాయాన్ని అందించారు.

మంగళవారం ఈ ఆర్థిక సహాయాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చీమలమర్రి మురళీకృష్ణ చేతుల మీదుగా ఇడమయ్య, సుశీల దంపతులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మురళీకృష్ణ, ఇడమయ్య దుస్థితిని గుర్తించి స్పందించిన దాతలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో ఇంకా మానవత్వం సజీవంగా ఉందని, అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు.

ఇడమయ్య పరిస్థితిని తెలుసుకున్న భద్రాచలానికి చెందిన ప్రముఖ సామాజికవేత్త బిర్రు సుధాకర్ కూడా స్పందించి, ఆయనకు కృత్రిమ కాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఇది ఇడమయ్య జీవితంలో కొత్త ఆశలు నింపే పరిణామమని మురళీకృష్ణ అన్నారు

అంతేకాకుండా, ఇడమయ్యకు ప్రభుత్వ పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నాయకుడు చీమలమర్రి మురళీకృష్ణ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు తెలిపారు. త్వరలోనే ప్రభుత్వ పరంగా కూడా సహాయం అందే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇడమయ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్న కొద్దీ మరింత మంది దాతలు సహకరించేందుకు ముందుకు వస్తుండటం విశేషం. ఆర్థిక ఇబ్బందులు, శారీరక వైకల్యాలతో జీవనం సాగిస్తున్న ఇడమయ్య కుటుంబానికి సమాజం అండగా నిలవడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కష్టాల్లో ఉన్న ఒక కుటుంబానికి చేయూతనందించిన దాతల సేవా భావం అందరికీ ఆదర్శప్రాయమని, ఇలాంటి సహాయ కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :

 నోటిఫికేషన్స్