చర్ల ఆసుపత్రిలో గిరిజన ఉపాధ్యాయుడి అవమానం..?

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

వైద్యుడిపై తీవ్ర ఆరోపణలు.. ఆగ్రహావేశంలో ఆదివాసీ, ఉపాధ్యాయ సంఘాలు

“ప్రజలకు సేవ చేయాల్సిన ఆసుపత్రిలోనే దౌర్జన్యం జరిగితే సామాన్యుడికి రక్షణ ఎక్కడ?”

గిరిజన ఉపాధ్యాయుడు పై చేయి చేసుకున్న డాక్టర్ కృష్ణ ప్రసాద్ పై జిల్లా కలెక్టర్  చర్యలు తీసుకోవాలని  ఆదివాసీ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లిన గిరిజన ఉపాధ్యాయుడు పలక నాగేశ్వరావుపై విధుల్లో ఉన్న డాక్టర్ కృష్ణ ప్రసాద్ అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా దాడికి పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణలు మండల వ్యాప్తంగా సంచలనంగా మారాయి.

ఈ ఘటనపై స్పందించిన ఆదివాసీ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ, ప్రజలకు వైద్యం అందించాల్సిన ఆసుపత్రుల్లోనే రోగులు అవమానాలకు, దౌర్జన్యాలకు గురవుతున్నారనే ఆరోపణలు రావడం అత్యంత ఆందోళనకరమన్నారు. గిరిజన సమాజానికి చెందిన ఉపాధ్యాయుడిపై జరిగినట్లు ఆరోపణలు వస్తున్న ఈ ఘటనను చిన్న విషయంగా చూడరాదని హెచ్చరించారు.

“ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన వైద్యులు తమ వృత్తి ధర్మాన్ని మరచి రోగులపై ఆగ్రహం చూపితే, ప్రజలు ఆసుపత్రులపై ఎలా నమ్మకం ఉంచాలి?” అని వారు ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న ఒక ఉపాధ్యాయుడే ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటే, సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు.

జేఏసీ నాయకులు ఊయికే బాలకృష్ణ, శ్యామల రామారావు, ఎస్‌.ఎస్‌.ఎస్‌. రవికుమార్ మాట్లాడుతూ..”ఆసుపత్రులు ప్రజలకు ఆశ్రయం కావాలి… ఆందోళన కేంద్రాలు కాదు” అంటూ జేఏసీ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై వెంటనే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని నిష్పక్షపాత విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

“రోగులను గౌరవించలేని వ్యక్తి వైద్యుడిగా కొనసాగడం సమాజానికి ప్రమాదకరం. ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజలకు భరోసా కేంద్రాలుగా ఉండాలి కానీ భయాందోళనలకు కారణం కాకూడదు” అని సంఘాల నాయకులు పేర్కొన్నారు.

ఈ ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, బాధితుడికి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో నీలం వెంకటరమణ, కుర్ల రాము, చిడం హిమగిరిబాబు, పున్నం వెంకటరమణ, తోటపల్లి రమేష్, కుర్ల మోహనరావు, కాపుల కృష్ణార్జునరావు, సూరిబాబు, సోయం దేశవీర్రాజు, ఇరుప రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :

 నోటిఫికేషన్స్