అటవీ శాఖలో అవినీతి బాగోతం బట్టబయలు..

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

అటవీ శాఖలో అవినీతి బాగోతం బట్టబయలు

రూ. 3.5 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎఫ్డీఓ, డీఆర్ఓ.

నేటి సూర్య ప్రతినిధి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ శాఖలో నెలకొన్న అవినీతి మరోసారి వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ శాఖల్లో ప్రజలకు సేవలు అందించాల్సిన అధికారులు, తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని భారీగా లంచాలు డిమాండ్ చేస్తుండటంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాజాగా భద్రాచలం అటవీ విభాగానికి చెందిన ఇద్దరు కీలక అధికారులు ఏసీబీ అధికారుల వలలో చిక్కుకోవడం సంచలనంగా మారింది.

చర్ల మండలంలోని పూసుగుప్ప ప్రాంతంలో ఇటీవల రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల సమయంలో కొన్ని అటవీ శాఖ చెట్లు దెబ్బతిన్నాయని పేర్కొంటూ, సంబంధిత కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించినట్లు సమాచారం. అయితే కేసు నమోదు చేయకుండా ఉండాలంటే భారీ మొత్తంలో లంచం ఇవ్వాలని భద్రాచలం డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (FDO) సుజాత డిమాండ్ చేసినట్లు తెలిసింది.

మొదట రూ.10 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చిన అధికారుల వ్యవహారంతో బాధితుడు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. అధికారుల వేధింపులకు విసిగిపోయిన బాధితుడు చివరకు అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులను ఆశ్రయించాడు. ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం పక్కా ప్రణాళికతో ఉచ్చుపన్నింది.

గురువారం భద్రాచలం అటవీ కార్యాలయంలో తొలి విడతగా రూ.3.5 లక్షలు లంచం స్వీకరిస్తుండగా ఎఫ్డీఓ సుజాతతో పాటు చర్ల ఇన్‌చార్జ్ డీఆర్ఓ కృష్ణయ్యను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం తీసుకున్న వెంటనే అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అనంతరం కార్యాలయంలో సోదాలు నిర్వహించి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ మాట్లాడుతూ, “అవినీతికి పాల్పడే ఏ అధికారినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రజలు భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేశారు.

ఇటీవల జిల్లాలో వరుసగా అవినీతి కేసులు వెలుగులోకి రావడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా కొత్తగూడెం అటవీ అభివృద్ధి సంస్థకు చెందిన ఒక అధికారి లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘటన మరువకముందే మరోసారి అటవీ శాఖ అధికారులు ఏసీబీకి చిక్కడం సంచలనం రేపుతోంది.

అటవీ శాఖలో కొందరు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటువంటి ఘటనలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని, అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు సేకరిస్తుండగా, మరికొంత మంది అధికారుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :

 నోటిఫికేషన్స్