భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దుమ్ముగూడెం మండలం, నరసాపురం గ్రామంలో చిన్న అరుణాచలం గా పేరుగాంచిన శివాలయంలో ఐదు అంతస్తుల భారీ రాతి రాజగోపురం నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన ఈ ఆలయం రోజురోజుకు అభివృద్ధి చెందుతూ భక్తులను ఆకర్షిస్తోంది.
పారంపరిక శైలిలో రాతితో నిర్మిస్తున్న ఈ రాజగోపురం పూర్తయితే ఆలయానికి మరింత శోభ చేకూరనుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శిల్పకళా నైపుణ్యంతో నిర్మితమవుతున్న ఈ గోపురం ప్రాంతీయ ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలవనుంది.
ఈ నిర్మాణానికి ఆలయ వ్యవస్థాపకులు శివ నాగరాజు (శివ నాగ స్వామి) కీలక పాత్ర పోషిస్తున్నారు. గోపుర నిర్మాణం కోసం ఆయన చేపట్టిన భక్తి యాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కొండగట్టు ఆలయం నుండి ప్రారంభమైన సుమారు 3200 కిలోమీటర్ల సైకిల్ యాత్ర బిక్షాటన రూపంలో వరంగల్ వరకు విజయవంతంగా చేరింది. మార్గమధ్యంలోని ప్రతి గ్రామంలో భిక్షాటన చేస్తూ ప్రజల సహకారం సేకరిస్తున్నారు.అలాగే పెద్ద అరుణాచలం నుండి చిన్న అరుణాచలం వరకు పాదయాత్ర చేపట్టి, గోపుర నిర్మాణాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు శివ నాగ స్వామి తెలిపారు. ఈ యాత్రల ద్వారా ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించడమే కాకుండా, ఆలయ అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని సమీకరిస్తున్నారు.
ఈ నిర్మాణానికి ఆలయ వ్యవస్థాపకులు శివ నాగస్వామి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన చేపట్టిన బిక్షాటన కార్యక్రమం ద్వారా సేకరించిన విరాళాలతో గోపుర నిర్మాణం వేగంగా కొనసాగుతోందని తెలిపారు. మణుగూరు, నాగినేని ప్రోలు, రెడ్డిపాలెం, బంజర, చర్ల, తెగడ వంటి ప్రాంతాల్లో నిర్వహించిన బిక్షాటన కార్యక్రమాలకు గ్రామ ప్రజలు విశేషంగా స్పందించి తమ వంతు సహకారం అందించారు.
ఈ సందర్భంగా శివ నాగస్వామి మాట్లాడుతూ, “ఈ ఆలయం అభివృద్ధి భక్తుల సహకారంతోనే సాధ్యమవుతోంది. అందరి ఆశీస్సులు, సహకారంతో గోపుర నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేసి భక్తులకు అంకితం చేస్తాం” అని తెలిపారు.
భక్తులు కూడా గోపుర నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజల ఐక్యత, భక్తి భావం కలిసి ఈ మహత్తర నిర్మాణానికి బలంగా నిలుస్తుంది.










