నేటిసూర్య ప్రతినిధి :
తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని చర్ల గ్రామంలోని అతి పురాతన మరియు మహిమాన్విత గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో గురువారం (మార్చి 19, 2026) ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
ఉగాది సందర్భంగా ఉదయం 6 గంటలకు అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించనున్నారు. అనంతరం 8 గంటలకు అలంకరణ కార్యక్రమం జరిపి, భక్తులకు దర్శనం కల్పించనున్నారు. ఈ సందర్భంగా భక్తులు తమ మొక్కుబడులను చెల్లించుకునే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
మధ్యాహ్నం 2.30 గంటల నుండి శ్రీ ముత్యాలమ్మ తల్లి గ్రామ సంరక్షణార్థం పురవీధుల్లో ఊరేగింపుగా బయలుదేరనున్నారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ కోరింది.
ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా జరిగే ఈ కార్యక్రమాలు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పడంతో పాటు భక్తుల్లో భక్తి భావాన్ని మరింత పెంపొందిస్తాయని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. గ్రామస్థులు, ప్రముఖులు, యువత, మహిళలు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
“అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే” అనే నమ్మకంతో భక్తులు అమ్మవారి సేవలో పాల్గొని కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.











