మానవత్వం చాటిన చిన్న అరుణాచలం సేవా బృందం
అగ్నిబాధిత కుటుంబానికి నిత్యావసర వస్తువులు అందించిన శివ నాగ స్వామి.
నేటిసూర్య ప్రతినిధి : కష్టకాలంలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం మానవత్వానికి ప్రతీక అని మరోసారి నిరూపిస్తూ శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ మహాక్షేత్రం చిన్న అరుణాచలం తరఫున సేవా కార్యక్రమం నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు శ్రీ శివ నాగ స్వామి ఆధ్వర్యంలో చర్ల మండలం వద్దిపేట గ్రామానికి చెందిన ఉయ్యుక రాము ఇల్లు ఇటీవల అగ్నిప్రమాదంలో కాలిపోయిన విషయం తెలుసుకుని స్వామి స్వయంగా వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.
అగ్నిప్రమాదం వల్ల తీవ్రంగా నష్టపోయిన కుటుంబాన్ని శివ నాగస్వామి ధైర్యం చెప్పి వారికి నిత్యావసర వస్తువులను అందజేశారు. ముఖ్యంగా బియ్యం, బట్టలు, దుప్పట్లు తదితర అవసరమైన సామగ్రిని పంపిణీ చేసి బాధిత కుటుంబానికి ఆర్థికంగా మరియు మానసికంగా అండగా నిలిచారు.
ఈ సందర్భంగా శివ నాగ. స్వామి మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్నవారికి చేయూతనివ్వడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని తెలిపారు. సమాజంలో ఎవరైనా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటే అందరూ కలిసికట్టుగా సహాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో సానుభూతి, సహానుభూతి పెరుగుతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో అరుణసేవా గణం సభ్యులు రమాదేవి, వాణి, ఉమాదేవి, రూప, మణి తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు కూడా ఈ సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు.










