ఆదివాసీలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దడంలో ఆమె కీలక పాత్ర
నేటిసూర్య ప్రతినిధి : ఓ ఆదివాసి మహిళా జాతీయ అవార్డు దక్కించుకొని అరుదైన గౌరవం తన ఖాతాలో వేసుకుంది… మారుమూల గిరిజన గ్రామంలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తూనే ఆదివాసుల జీవన శైలిపై ప్రభావితం చేయగలిగిందామె. తన పేరులోనే వెలుగు, కాంతిని సొంతం చేసుకొని ఇతరుల బతుకుల్లో చీకటిని పోగొట్టగలిగిన ఆది శక్తిగా తుర్రం జ్యోతి పరిచయమైంది. వివరాలిలా ఉన్నాయి… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని తేగడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా తుర్రం జ్యోతి విధులు నిర్వహిస్తున్నారు. ఆదివాసీ మహిళలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దడంలో ఇప్ప పువ్వు లడ్డు తయారీ వంటి అనేక సేవా కార్యక్రమాల్లో ఆమె కీలక పాత్ర పోషించారు. ఈమె క్రియేటివిటీ, ప్రతిభను గుర్తించిన విజయవాడలోని సర్వోత్తమ గ్రంథాలయం వారు మహిళా దినోత్సవం పురస్కరించుకొని తుర్రం జ్యోతికి మహిళా కీర్తి రత్న జాతీయ అవార్డును అందజేసి కిరీటం పెట్టి శాలువాతో ఘనంగా సత్కరించి మెమెంటో అందజేశారు. శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో వైభవంగా జరిగిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ చేతుల మీదుగా అవార్డును ఆమెకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉపాధ్యాయ వృత్తిలోనూ విద్యార్థుల భవిష్యత్తుకై ఆమె కృషి ఎనలేనిదని ఆమె ఇంకా మరెన్నో అవార్డులను అందుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అవార్డును అందుకున్న తుర్రం జ్యోతి మాట్లాడుతూ… విద్యారంగం, గిరిజన మహిళ అభివృద్ధి, సేవా రంగంలో ఆమె చేసిన కృషిని గుర్తించి శ్రీశ్రీ కళావేదిక అవార్డు ఇవ్వడం ఎంతో సంతృప్తినిచ్చిందని అవార్డుకి ఎంపిక చేసిన సీఈఓ కత్తిమండ ప్రతాప్, జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణంలకు ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.










