విద్యార్థులు విద్యతో ప్రయోజకులవ్వాలి.
ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తోటమళ్ల.
నేటిసూర్య ప్రతినిధి: విద్యార్థులు చక్కగా చదువుకొని పాఠశాలలో టీచర్లు బోధించే వాటిని శ్రద్ధగా విని ప్రయోజకులవ్వాలని చర్ల ప్రెస్ క్లబ్ అద్యక్షుడు తోటమళ్ల రమణమూర్తి సూచించారు. అందుకుగాను ఇప్పటి నుండే ఖచ్చితమైన ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. రమణమూర్తి – వెంకటరమణ దంపతుల ద్వితీయ కుమార్తె తోటమల్ల భవ్యశ్రీ జన్మదినం సందర్భంగా వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం నిలయ విద్యార్ధులకు భోజన ఏర్పాట్లతో పాటు వాటర్ గీజర్, 50 కేజీల బియ్యం వితరణగా అందచేశారు. ఈ సందర్భంగా వనవాసీ ప్రఖండ ప్రముఖ్ గొంది శోభన్‌బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రమణమూర్తి విద్యార్ధులను ఉద్దేశించి ప్రశాంగించారు. ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించి ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. తామేమి కావాలో చిన్ననాటి నుండే లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చన్నారు. ఇక్కడి విద్యార్థుల క్రమ శిక్షణ తనకు ఎంతగానో ఆకట్టుకుందని అందుకే తమ కుమార్తె జన్మదినం సందర్భంగా వితరణ అందచేశామన్నారు. వనవాసీ ప్రాంత సహ మహిళా ప్రముఖ్ పెద్దాడ ఆశాలత మాట్లాడుతూ… జన్మదినం, ఇతర శుభ, అశుభ కార్యక్రమాల సందర్భంగా డబ్బు వృధా చేయకుండా విద్యార్ధులకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. వనవాసీ విద్యార్థులు శీతాకాలంలో చలికి ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించి గీజర్ ను అందచేయడం అభినందనీయమని కొనియాడారు. సంస్థ ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్థిక సహకారం, ఇతర సౌకర్యాలను పొందదని కేవలం దాతల సహకారంతో నడుస్తుందని వెల్లడించారు. గిరిజనుల అభ్యన్నతి కొరకు సంస్థ దేశ వ్యాపితంగా విద్యార్థి నిలయాలను నిర్వహిస్తోందని తెలిపారు. వన వాసీ జిల్లా కార్యదర్శి కోరం సూర్యనారాయణ మాట్లాడుతూ… వనవాసీ విద్యార్ధులకు దాతలు అందచేస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్ధులు ఇటువంటి అవకాశాలను సద్వినియోగపరుచుకొని దాతల నమ్మకాన్ని వమ్ముచేయకుండా చదువుపై దృష్టిసారించి ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. విద్యతోనే వినయం విధేయత వస్తుందని, కుటుంబంలో ఒక్కరు చదువుకొని జీవితంలో స్థిరపడితే ఆ కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అందుకే తాము విద్యపై దృష్టిసారించి పేద విద్యార్థులకు సహకారమందించడంతో పాటు వారిని ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. గిరిజన విద్యార్ధుల సంక్షేమం, అభ్యున్నతి కొరకు పాటుపడే సంస్థకు దాతలు తమవంతు సహకారమందించి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నిలయ కమిటీ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ, ఉపాధ్యక్షులు గోగికార్ రాంలక్ష్మణ్, సహ కోశాధికారి వేములపల్లి ప్రవీణ్ బాబు, సభ్యులు లవన్ కుమార్ రెడ్డి, నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్న కుమారి, తోటమళ్ల కృష్ణారావు, కొంగూరి సత్యం, చిట్టిమళ్ల మురళీ పాల్గొన్నారు.










