సేవా నిరతి…. తల్లిదండ్రులే స్ఫూర్తి

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

వనవాసీలకు రిఫ్రిజరేటర్ అందచేసిన జవ్వాది బ్రదర్స్

జవ్వాదిల సేవలు అమోఘం : బీవీఎస్ఎల్ నరసింహారావు

నేటి సూర్య ప్రతినిధి :తల్లిదండ్రుల స్ఫూర్తితో సేవ… తల్లిదండ్రులు నేర్పిన విలువలు, ఆదర్శాల నుండి ప్రేరణ పొంది ఇతరులకు సహాయం చేయడం, సమాజానికి సేవ చేయడం గొప్ప మనసున్న వారే చేస్తారు. అందులో భాగంగా పేదలకు సహాయం చేయడం, నిరుపేద విద్యార్థులకు అండగా నిలవడం, స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, లేదా తల్లిదండ్రుల పేరిట సేవా కార్యక్రమాలు చేయడం వంటి రూపాల్లో ఉంటుంది. తల్లిదండ్రుల పట్ల గౌరవంతో, వారి ఆశయాలను కొనసాగిస్తూ చేసే సేవ చాలా గొప్పదని వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్థి నిలయ గౌరవ సలహాదారులు బీవీఎస్ఎల్ నరసింహారావు ప్రశంసించారు. శుక్రవారం నాడు చర్లకు చెందిన ఆదర్శ రైతు జవ్వాది జయకుమార్ (జయబ్బాయి), ఆయన సతీమణి జవ్వాది సాయిలక్ష్మి నాల్గవ వర్ధంతి సందర్భంగా వనవాసీ కొమరం భీం విద్యార్ది నిలయంకు వారి కుమారులు వెంకటేశ్వరబాబు, నరేంద్ర బాబు, రవికుమార్, సత్యనారాయణ, మురళీకృష్ణలు రిఫ్రిజరేటర్, విద్యార్ధులకు భోజన ఏర్పాట్లు, స్వీట్స్, పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా వన వాసీ గౌరవ సలహాదారులు బీవీఎస్ఎల్ నరసింహారావు మాట్లాడుతూ… జయకుమార్ – సాయిలక్ష్మి దంపతులు అనేక మంది పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందచేసి వారి ఉన్నతికి తోడ్పడ్డారని పేర్కొన్నారు. ఈ దంపతుల సహకారంతో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, డాక్టర్లుగా స్థిరపడ్డారని గుర్తుచేశారు. తల్లిదండ్రులు అందించిన స్ఫూర్తిని పునికిపుచ్చుకొని కుమారులు అదే బాటలో పయనించడం నిజంగా అభినందనీయమని కొనియాడారు. ఆర్థిక సహాయం చేసే సామర్ధ్యమున్నా అనేక మంది ముందుకు రావడం లేదని జయకుమార్ కుమారులు వన వాసీ సంస్థతో పాటు ఇతర అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. గోదావరి వరదల సమయంలో సర్వస్వం కోల్పోయిన బాధితులకు రూ.1లక్ష విలువ చేసే గిన్నెలు, ఇతర సామగ్రి అందచేసి మానవత్వం చాటుకున్నారని గుర్తుచేశారు. భద్రాచలం డివిజన్ లో ఎవరూ చేయని విధంగా పలు గిరిజన గ్రామాలకు చెందిన 40మందికి పైగా ఆదివాసీ గర్భిణీ స్ర్తీలకు సామూహిక శ్రీమంతాల కార్యక్రమం చేపట్టి గొప్ప ఒరవడికి శ్రీకారం చుట్టారని ప్రశంసించారు. వనవాసీ సంస్థకు వితరణలను అందించడంలో జవ్వాది కుటుంబానిదే అగ్ర స్థానమని పేర్కొన్నారు. ఎంతో విలువైన భూమిని సంస్థకు ఇవ్వడమే కాకుండా విద్యార్ధుల అవసరాలను గుర్తించి పరుపులు, ట్రంక్ పెట్టెలు, కన్వర్టర్, బ్యాటరీ, భోజన సదుపాయాలు, విద్యార్ధులకు అవసరమైన దుస్తులను పంపిణీ చేసి దాతృత్వం చాటుకున్నారని అన్నారు. వన వాసీ ప్రాంత మహిళా సహ ప్రముఖ్ పెద్దాడ ఆశాలత, గురుదేవ్ విద్యాలయం ప్రిన్సిపాల్ హెచ్ జీవీ. ప్రసాద్, అకాడమిక్ కో-ఆర్డినేటర్ మల్లాది సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ… అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న జవ్వాది కుటుంబ సభ్యులను అభినందించారు. విద్యార్థులు ఇటువంటి దాతల స్ఫూర్తితో ముందుకు సాగుతూ ఉన్నత చదువుల్లో రాణించాలని కోరారు. ఎటువంటి సౌకర్యాలు లేని మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్ధులకు వారి అవసరాలకు అనుగుణంగా కావాల్సిన వస్తువులను సమకూర్చడం సంతోషకరమని అన్నారు. విద్యార్ధులు ఇటువంటి అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. జవ్వాది కుటుంబ సభ్యులు, విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయులు నరేంద్ర బాబు మాట్లాడుతూ… ఆదివాసీ విద్యార్ధుల అభ్యున్నతికి కృషిచేస్తున్న వన వాసీ సేవలు అమోఘమని కొనియాడారు. వీరు అందచేస్తున్న స్ఫూర్తితో తమ వంతు సహాయంగా సంస్థకు తమ కుటుంబం సహకారమందిస్తోందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండి విద్యార్ధుల చదువులకు తోడ్పాటునందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జవ్వాది కుటుంబ సభ్యులు జవ్వాది రవి కుమార్, జవ్వాది మురళీ కృష్ణ, జవ్వాది శ్రీనివాసరావు, పామర్తి కౌషిక్, వన వాసీ జిల్లా కార్యదర్శి కోరం సూర్యనారాయణ, ప్రఖండ ప్రముఖ్ గొంది శోభన్‌బాబు, కొమరం భీం విద్యార్థి నిలయ కమిటి అధ్యక్షుడు తాటి పాపారావు, ఉపాధ్యక్షులు గోగికార్ రాం లక్ష్మణ్, సహ కోశాదికారి వేములపల్లి ప్రవీణ్ బాబు, బందా స్వరూప రాణి, లవన్ కుమార్ రెడ్డి, పాశికంటి శ్రీదేవి, నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్న కుమారి తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్