చర్ల, నేటిసూర్య న్యూస్: రోజుల్లో పుట్టిన రోజు వచ్చిందంటే చాలు కొత్త బట్టలు ధరించి, కేకులు కట్ చేసి నానా హంగామా చేస్తుంటారు కొందరు… మరీ కొందరు వారి వారీ స్తోమతలను బట్టి చాలా ఉల్లాసంగా… ఉత్సాహంగా జరుపుకోవడం సమాజంలో అలవాటుగా మారింది. కానీ ఇంకొంత మంది ఉన్నారే… తమ ఇంట్లో ఏ శుభకార్యం చేయాల్సి వస్తే అందులో నిరుపేదలను చేర్చుకోవడం వారి హుందా తనానికి, దాతృత్వానికి నిదర్శనమని చెప్పవచ్చు. అదే కోవకు చెందిన వారు ఆదివారం నాడు తమ ఔదార్యం చాటుకున్నారు. పెద్దాడ వెంకట గోపాలస్వామి, పార్వతి, ప్రమీల జ్ఞాపకార్థంతో పాటు వారి మనవడు ముప్పిరిశెట్టి జ్ఞానేశ్వర్ జన్మదినాన్ని పురస్కరించుకొని వారి తల్లిదండ్రులు శేషారావు వరలక్ష్మీ దంపతులు వన వాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీమ్ విద్యార్థి నిలయం విద్యార్థులకు ఒక పూట భోజనంతో పాటు వంట పాత్రలను వితరణగా అందజేశారు. అనంతరం వన వాసీ తెలంగాణ ప్రాంత సహ మహిళా ప్రముఖ్ పెద్దాడ ఆశాలత మాట్లాడుతూ… ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి సరిహద్దున ఉన్న మారుమూల గిరిజన గ్రామాల ఆదివాసీ విద్యార్థులను అక్కున చేర్చుకొని వారికి సంస్కృతి, సంప్రదాయాలు ఆచార వ్యవహారాలతో పాటు చక్కటి విద్యా బుద్ధులు నేర్పిస్తూ గిరిజన విద్యార్థుల అభ్యున్నతి కొరకు పాటు పడుతోన్న వన వాసీ కళ్యాణ పరిషత్ సేవలకు ముగ్ధులై హైదరాబాద్ వాస్తవ్యులైన శేషారావు వరలక్ష్మి దంపతులు విద్యార్థులకు అవసరమగు వంట పాత్రలను వితరణగా అందజేశారని ఆమె అన్నారు. దాతలకు నిలయ కమిటీ సభ్యులు హృదయ పూర్వకమైన ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి జవ్వాది మురళీ కృష్ణ, ఉపాధ్యక్షులు గోగికార్ రామ లక్ష్మణ్, నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్న, ప్రఖండ ప్రముఖ్ గొంది శోభన్ బాబు, కమిటీ సభ్యులు పోలిన రమాదేవి, గ్రామీణ వైద్యులు బత్తుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.











