“హస్తం”కు మొండి చెయ్యిద్దాం… ఎన్నికల్లో ఓడిద్దాం…
రైతులకు యూరియా ఇవ్వని ప్రభుత్వ వైఖరి నశించాలి.
నేటిసూర్య ప్రతినిధి:
బహుజనుల ఆత్మగౌరవం, అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం నిరంతరం పరి తపిస్తోన్న బీఎస్పీకి అధికారమీవ్వాలని ఆ పార్టీ చర్ల మండల అధ్యక్షులు కొండా కౌశిక్ కోరారు. చర్ల మండల కేంద్రంలోని రైతు సహకార భవన్ చర్ల సొసైటీని బహుజన సమాజ్ పార్టీ చర్ల మండల నాయకత్వం సందర్శించారు. ఈ క్రమంలో అక్కడ రైతులు (యూరియా) కోసం పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మట్టినే నమ్ముకున్న రైతన్నలు ధాన్యం పండించే క్రమంలో లక్షల రూపాయలను వడ్డీలకు సైతం లెక్క చేయకుండా అప్పులు తెచ్చి తినీ తినక ఆరుగాలం కష్టించి ఆ పైసలను తను పండించే పంటపై ధార పోస్తారని పంట చేతికి రావడం కోసం ఎరువులను పై మందులను పిచికారి చేస్తేనే తప్పా ఆ పంట చేతికి వచ్చే పరిస్థితి లేదన్నారు. మరి అలాంటి సమయంలో రైతన్నలకు (యూరియా) ఎరువు బస్తాలు అందుబాటులో లేకపోవడంతో రైతన్నలు నానా అవస్థలు పడుతున్నారని చెప్పులు అరిగేలా సొసైటీలా చుట్టు తిరుగుతున్నారని ఇందుకు కారణం కచ్చితంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వమేనని అయన మండిపడ్డారు. ఇదేనా ప్రజా ప్రభుత్వం అంటే అని ప్రశ్నించారు. రైతే రాజు, రైతు లేకపోతే దేశ అభివృద్ధి లేదని చెప్పుకునే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సమాధానం చెప్పాలని అన్నారు. పది ఎకరాలు వరి పంట పండించే రైతుకి ఒక్కటే యూరియా బస్తా ఇస్తానని చెప్పడం సిగ్గుచేటని ఇందుకు ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. ఎరువు బస్తాల కోసం రైతులను ఈ ప్రభుత్వం కాళ్ల చెప్పులరిగేలా తిప్పడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. తక్షణమే రైతులకు సరిపడా (యూరియా)నూ ఇతర ఎరువులను అందుబాటులోకి తెచ్చి రైతన్నలను కాపాడుకోవాలని బహుజన సమాజ్ పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుందన్నారు. ఇది ఇలాగే కొనసాగితే భారత రాజ్యాంగానికి లోబడి బాదిత రైతాంగాన్ని మొత్తం పెద్ద ఎత్తున ఐక్యం చేసి ఉద్యమ బాట పడతామని తద్వారా రైతాంగాన్ని కాపాడుకుంటామని ఆయన తెలిపారు. రైతుల పట్ల రైతుల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఏమాత్రం లేని కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీలను రానున్న స్థానిక ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. బహుజనుల ఆత్మగౌరవం, రైతుల సంక్షేమం కోసం నిరంతరం అహర్నిశలు కష్టపడుతున్న బీఎస్పీని రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ చర్ల మండల కోశాధికారి జహీరుద్దీన్, ఈసీ మెంబర్ మడివి నందకిషోర్, సోషల్ మీడియా ఇంచార్జ్ చెన్నం పవన్ కుమార్, బాధిత రైతాంగం పాల్గొన్నారు.











