నేటి సూర్య ప్రతినిధి:
మిషన్ భగీరథ అధికారుల పర్యవేక్షణ నిర్లక్ష్యం కారణంగా భగీరథ నీళ్లు కాస్త వృధాగా పారుతున్నాయి. మండలంలోని పలు గ్రామాల్లో ప్రతి ఇంటికి మంచినీళ్లు అందాల్సిన నీళ్లు కాస్త వృధాగా పారసాగాయి. గ్రామాలలో తాగునీరు అందక ప్రజలు అల్లాడుతుంటే అధికారుల నిర్లక్ష్యం కారణంగా భగీరథ నీళ్లు వృధా అవుతున్నాయి. దీనికి ముఖ్యంగా అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే ప్రధాన కారణం అంటూ స్థానికులు చెబుతున్నారు. ఈ విషయమై సంబంధిత మిషన్ భగీరథ అధికారులకు తెలియజేసిన పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపించారు. మిషన్ భగీరథ నీళ్లు నారు పంటల పాలవుతున్నాయి. కళ్ళ ముందే వృధా చేస్తున్నా పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదనిఆగ్రహం వ్యక్తం అవుతోంది. లింగాపురం గ్రామపంచాయతీలోని మిషన్ భగీరథ త్రాగునీరు పంచాయతీ సిబ్బంది కళ్ల ముందే వృధా చేస్తున్నా కనీసం దానిని ఆపే ప్రయత్నం కూడా చేయడంలేదు. రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి మంచి నీటిని అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించింది. దీని కోసం వేల కోట్లు రూపాయలను వెచ్చించింది. ప్రజల కోసం ఇంత ఖర్చు చేసినా కొందరి నిర్లక్ష్యం కారణంగా వృధాగా మారుతుంది. మనిషి ఆరోగ్యానికి మిషన్ భగీరథ నీరు మంచిదని మిషన్ భగీరథ తాగునీటిపై కలిగే ప్రయోజనాలు, ఇతర నీటి వినియోగం వల్ల కలిగే దుష్ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. మిషన్ భగీరథ నీటిలో శరీరానికి కావాల్సిన లవణాల శాతం తగు మోతాదులో ఉండడంతో నీరసపడకుండా అంతర్గత అవయవాలు సరిగా పని చేసి ఆరోగ్య సమస్యలు మెరుగవుతాయని, గ్రామంలో ప్రతి ఒక్కరు మిషన్ భగీరథ నీరు తాగాలి. ఈ నీటి వినియోగం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆర్‌వో వాటర్ డబ్బా నీరు తాగడంతో ఫ్లోరైడ్‌స్థాయి తగ్గి మోకాళ్ల నొప్పులు, చిన్న పిల్లల్లో ఎదుగుదల లోపం, ఎముకలు మెత్తబడే అవకాశాలు ఉంటాయి. అలాంటి మంచినీళ్లను కొందరు నారు పంటలకు, వాహనాలు కడుక్కోటానికి, మొక్కలకు నీళ్లు పెట్టుకోవడానికి, వినియోగిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు, పంచాయితీ సిబ్బంది కళ్ళముందే ఇదంతా జరుగుతున్న ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కావటం లేదని గ్రామస్తులు ఆరోపణ, ఇప్పటికైనా పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది స్పందించి మంచినీటిని వృధా చేయకుండా గ్రామస్తులు వినియోగించే విధంగా చూడాలని కోరుతున్నారు.











