బూర్గంపాడు, నేటిసూర్య ప్రతినిధి : మండలం పరిధిలోని నాగినేనిప్రోలు, రెడ్డిపాలెం గ్రామాలకు చెందిన ప్రజలు తమకు ఒక ఫంక్షన్ హాల్ స్థలం కొరకు సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠకు విన్నవించుకున్నారు. ఈ గ్రామాల్లో ఫంక్షన్ హాల్ లేకపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడానికి సరైన స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామ ప్రజలు తమ వినతి పత్రంలో పేర్కొన్నారు. ఫంక్షన్ హాల్ అందుబాటులో ఉంటే అది గ్రామాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని, గ్రామంలోని ప్రతి కుటుంబానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు వివరించారు. గ్రామ ప్రజల తరపున ఈ వినతి పత్రాన్ని సమర్పించిన వారిలో బూశిరెడ్డి శంకర్ రెడ్డి (మాజీ రోటరీ గవర్నర్), కుందురు శ్రీనివాసరెడ్డి, రెడెం రవీందర్ రెడ్డి, రెడెం కోటి రెడ్డి, పిల్లలమర్రి సుధాకర్, సమర సింహా రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొని తమ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ… గ్రామంలో ఫంక్షన్ హాల్ అవశ్యకత చాలా ఉందని, దీని నిర్మాణానికి సబ్ కలెక్టర్ తగిన స్థలాన్ని కేటాయించి సహాయం చేయాలని కోరారు. ఇందుకుగాను సబ్ కలెక్టర్ సానుకూలంగా స్పందించి త్వరలో పరిశీలించి తగిన ఏర్పాటు చేస్తామని తెలిపినట్టు పేర్కొన్నారు.











