విద్యార్థులు చిన్ననాటి నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

చదువుకొని ప్రయోజకులు కావాలి.

మనవడి జన్మదినం సందర్భంగా వనవాసీ విద్యార్థులకు వితరణ.

భద్రాచలం వాసి కొసరాజు రామ్మోహన్.

నేటిసూర్య ప్రతినిధి: చదువే  జీవితానికి బలమైన పునాది అని, విద్యార్థులు చిన్ననాటి నుంచే తమ భవిష్యత్ లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా క్రమశిక్షణతో ముందుకు సాగాలని భద్రాచలం పట్టణానికి చెందిన కొసరాజు రామ్మోహన్ సూచించారు. కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవడంతో పాటు తల్లిదండ్రులకు, విద్యాసంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. చర్లలోని వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం, శబరి బాలికా నిలయ విద్యార్థులకు రామ్మోహన్ తన మనవడు సాయి గగన్ జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం స్టీల్ భోజన ప్లేట్లు, పండ్లు, పెన్నులు, బిస్కెట్లను అందజేశారు. కొసరాజు గోపికృష్ణ–శైలజ దంపతుల కుమారుడైన సాయి గగన్ జన్మదిన వేడుకలను విద్యార్థుల మధ్య సేవా కార్యక్రమంగా నిర్వహించడం విశేషంగా నిలిచింది.

కొమరం భీం విద్యార్థి నిలయ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రామ్మోహన్ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితంలో ఏ స్థాయికి చేరుకోవాలనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకొని, అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. చదువుపై ఏకాగ్రత, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చన్నారు.
వనవాసీ విద్యార్థుల క్రమశిక్షణ తనను ఎంతగానో ఆకట్టుకుందని రామ్మోహన్ తెలిపారు. అందుకే తన మనవడి జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు తనవంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. విద్యార్థులు అందివచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు.

దాతల సహకారంతోనే విద్యార్థులకు అండ

వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్థి నిలయ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ మాట్లాడుతూ.. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. విద్యార్థులు దాతలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కష్టపడి చదివి జీవితంలో స్థిరపడాలని సూచించారు.
విద్యతో పాటు వినయం, విధేయత అలవడతాయని, ఒక కుటుంబంలో ఒక్కరు విద్యావంతులై జీవితంలో స్థిరపడినా ఆ కుటుంబం మొత్తం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని అన్నారు. పేద విద్యార్థులకు సహకారం అందించడంతో పాటు వారిని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని తెలిపారు.
వనవాసీ సంస్థ ప్రభుత్వ సహాయంపై ఆధారపడకుండా ప్రధానంగా దాతల సహకారంతోనే సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోందని మురళీకృష్ణ అన్నారు. గిరిజన విద్యార్థుల విద్య, సంక్షేమం, అభ్యున్నతి కోసం పనిచేస్తున్న సంస్థకు దాతలు మరింతగా అండగా నిలిచి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రామ్మోహన్ సతీమణి రమాదేవి, నిలయ కమిటీ ఉపాధ్యక్షుడు గోగికార్ రాంలక్ష్మణ్, నిలయ ప్రముఖులు వరలక్ష్మి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్