క్రమశిక్షణతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరాలి.

చర్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూజారి సామ్రాజ్యం.

చర్ల, ఆగస్టు 18, నేటిసూర్య: విద్యార్థులు పట్టుదలతో చదువుతూ క్రమశిక్షణను అలవర్చుకుని జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని చర్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూజారి సామ్రాజ్యం అన్నారు. చదువుతో పాటు క్రమశిక్షణ, మంచి నడవడిక, లక్ష్యసాధనపై దృష్టి సారించినప్పుడే విద్యార్థులు భవిష్యత్‌లో ఉన్నత స్థానాలను అధిరోహించగలరని ఆమె సూచించారు.

చర్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ భర్త, యువజన కాంగ్రెస్ నాయకులు వల్లి శ్రీకాంత్ జన్మదినాన్ని పురస్కరించుకుని, ఆయన స్నేహితులు, 2003–2004 విద్యా సంవత్సరంలో చర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు చర్లలోని వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్థి నిలయానికి సేవా కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థి నిలయానికి 50 కేజీల బియ్యం, 20 స్టీల్ ప్లేట్లు, పండ్లు, స్వీట్స్ అందజేశారు.

ఈ సందర్భంగా విద్యార్థి నిలయ కమిటీ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సర్పంచ్ పూజారి సామ్రాజ్యం మాట్లాడుతూ.. విద్యార్థులు ఇతర వ్యాపకాలపై దృష్టి మళ్లించకుండా విద్యాభ్యాసంపైనే పూర్తి శ్రద్ధ కనబరచాలని కోరారు. చదువే జీవితానికి మంచి పునాది అని, విద్యను సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్‌లో మంచి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని అన్నారు.

ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడిన వారిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానిని సాధించే దిశగా నిరంతరం కృషి చేయాలని, మధ్యలో ఎదురయ్యే ఇబ్బందులకు భయపడకుండా పట్టుదలతో ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు.

క్రమశిక్షణే విజయానికి మార్గం.

విద్యార్థి జీవితంలో క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఉందని సర్పంచ్ సామ్రాజ్యం పేర్కొన్నారు. క్రమశిక్షణతో మెలిగే విద్యార్థులు చదువులోనే కాకుండా జీవితంలోని ప్రతి రంగంలోనూ విజయాన్ని సాధించగలరని అన్నారు. సమయపాలన, గురువులను గౌరవించడం, తల్లిదండ్రుల మాట వినడం, మంచి అలవాట్లను పెంపొందించుకోవడం ద్వారా విద్యార్థులు ఉన్నత వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలని సూచించారు.

గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధి, సంక్షేమం కోసం వనవాసీ కళ్యాణ పరిషత్ వంటి సంస్థలు విద్యార్థి నిలయాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు సంస్థ ఆశయాలను గుర్తించి క్రమశిక్షణతో మెలుగుతూ ఉన్నతంగా చదివి సంస్థకు, తల్లిదండ్రులకు, తమ ప్రాంతానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

దాతల సహకారం మరువలేనిది.

వనవాసీ జిల్లా కార్యదర్శి కోరం సూర్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థుల కోసం దాతలు అందిస్తున్న సహకారం మరువలేనిదని అన్నారు. విద్యార్థి నిలయాల నిర్వహణకు ప్రభుత్వాల నుంచి ఎటువంటి ఆదాయం సమకూరడం లేదని, దాతలు, శ్రేయోభిలాషుల సహకారంతోనే సంస్థ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

విద్యార్థుల అవసరాలను గుర్తించి బియ్యం, ప్లేట్లు, పండ్లు, స్వీట్స్ అందించడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు సమాజం తమకు అండగా ఉందనే భరోసాను కల్పిస్తాయని పేర్కొన్నారు. దాతల నమ్మకానికి అనుగుణంగా విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో స్థిరపడాలని కోరారు.

సేవా కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు అండగా నిలుస్తున్న పూర్వ విద్యార్థులు, దాతలను ఆయన అభినందించారు. భవిష్యత్‌లో కూడా విద్యార్థుల విద్యాభివృద్ధికి మరింత మంది దాతలు ముందుకు వచ్చి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో వల్లి శ్రీకాంత్, పాసికంటి సంతోష్, బాజీ, గౌస్ పాషా, ఆలం సతీష్, గంప మాణిక్యాలరావు, కొండేటి చంద్రశేఖర్, తూము రాము, తోకల నాగేంద్ర, చంద్రమౌళి, సాంబ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిన పూర్వ విద్యార్థులు.

తమ స్నేహితుడి జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా విద్యార్థి నిలయానికి అవసరమైన వస్తువులను అందించి సేవా కార్యక్రమంగా నిర్వహించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. పూర్వ విద్యార్థులు చూపిన ఈ సేవా స్ఫూర్తి మరింత మందికి ఆదర్శంగా నిలుస్తుంది.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :

 నోటిఫికేషన్స్