గిరిజన విద్యార్థుల చదువుకు దాతల చేయూత
దివంగత వెంకట కావ్య జ్ఞాపకార్థం విద్యార్థి నిలయానికి బియ్యం, భోజన వితరణ
చర్ల, సెప్టెంబర్ 6 (నేటి సూర్య):
మారుమూల గిరిజన ప్రాంతాల నుంచి వచ్చి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఆపన్నహస్తం అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు బాటలు వేయవచ్చని ప్రముఖ వ్యాపారి ఎడారి గణపతి అన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకుండా సమాజంలోని దాతలు తమకు తోచిన విధంగా సహకరించాలని ఆయన కోరారు.
తన కుమార్తె దివంగత ఎడారి వెంకట కావ్య జ్ఞాపకార్థం చర్లలోని కొమరం భీం విద్యార్థి నిలయానికి 75 కేజీల బియ్యాన్ని అందజేయడంతో పాటు విద్యార్థులకు ఒకపూట భోజనాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థి నిలయ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గణపతి మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమం కోసం చేపడుతున్న సేవా కార్యక్రమాల పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
గిరిజన విద్యార్థులు విద్యను అభ్యసించి తమ కుటుంబాలతో పాటు సమాజానికి కూడా ఉపయోగపడే స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థి దశలోనే క్రమశిక్షణ, బాధ్యత, మంచినడవడికను అలవర్చుకోవాలని సూచించారు. చదువులో ప్రతిభ కనబరచడంతో పాటు ఉత్తమ ప్రవర్తన కలిగిన వ్యక్తులుగా ఎదిగినప్పుడే జీవితంలో నిజమైన విజయాన్ని సాధించగలరని అన్నారు.
గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు విద్యను చేరువ చేసేందుకు వనవాసీ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని గణపతి పేర్కొన్నారు. విద్యార్థులకు వసతి, భోజన సదుపాయాలతో పాటు విద్యాబుద్ధులు నేర్పిస్తూ వారిని భవిష్యత్తుకు సిద్ధం చేయడం గొప్ప సేవ అని కొనియాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో తన వంతు భాగస్వామ్యం కల్పించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.
విద్యతో పాటు సంస్కారానికి ప్రాధాన్యం.
వనవాసీ ప్రాంత మహిళా సహ ప్రముఖ్ పెద్దాడ ఆశాలత మాట్లాడుతూ గిరిజనుల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని సంస్థ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో అవసరమైన సహాయాన్ని అందిస్తూ గిరిజన కుటుంబాలకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు.
మారుమూల గ్రామాల నుంచి వచ్చే ఆదివాసీ విద్యార్థులను విద్యార్థి నిలయాల్లో చేర్పించి వారి చదువుకు అవసరమైన వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. ఆధునిక విద్యతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపై అవగాహన కల్పించడం ద్వారా విద్యార్థుల్లో విలువలను పెంపొందిస్తున్నామని అన్నారు.
కొమరం భీం విద్యార్థి నిలయంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల ప్రతిభ, క్రమశిక్షణను చూసి పలువురు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని ఆశాలత తెలిపారు. తమ సంపాదనలో కొంత భాగాన్ని విద్యార్థుల కోసం కేటాయిస్తూ సహాయం చేస్తున్న దాతల సేవలు అభినందనీయమన్నారు.
ఎడారి గణపతి అందించిన సహకారం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని, దాతల సహకారంతో విద్యార్థి నిలయంలో మరిన్ని కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రోత్సాహం లభిస్తోందని పేర్కొన్నారు. విద్యార్థులు తమకు అందుతున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని పట్టుదలతో చదివి జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.
గిరిజన విద్యార్థుల్లో ప్రతిభకు కొదవ లేదని, వారికి సరైన అవకాశాలు, మార్గదర్శకత్వం, ప్రోత్సాహం లభిస్తే విద్య, ఉద్యోగ, సామాజిక రంగాల్లో అద్భుతంగా రాణించగలరని కార్యక్రమంలో పాల్గొన్న పలువురు అభిప్రాయపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం సమాజంలోని ప్రతి వర్గం తమ వంతు సహకారం అందించాలని వారు కోరారు. కార్యక్రమంలో ఎడారి లక్ష్మణ్‌రావు, వనవాసీ జిల్లా కార్యదర్శి కోరం సూర్యనారాయణ, కొమరం భీం విద్యార్థి నిలయ అధ్యక్షుడు తాటి పాపారావు, ఉపాధ్యక్షులు గోగికార్ రాంలక్ష్మణ్, సహ కోశాధికారి వేములపల్లి ప్రవీణ్‌బాబు, కమిటీ సభ్యురాలు పోలిన రమాదేవి, నిలయ ప్రముఖులు వరలక్ష్మి, సంతోష్, సహ నిలయ ప్రముఖ్ ముఖేష్ తదితరులు పాల్గొన్నారు










