టీవీఆర్ చంద్రం జీవితం ఉద్యమకారులకు స్ఫూర్తి.
‘ఎగరేసిన ఎర్రజెండా’ పుస్తకావిష్కరణ.
నేటి సూర్య ప్రతినిధి : ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి చివరి వరకు ప్రజా ఉద్యమాల్లో కొనసాగిన వారే నిజమైన కమ్యూనిస్టులని వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. భద్రాచలంలోని కేకే ఫంక్షన్ హాల్‌లో అమరజీవి టీవీఆర్ చంద్రం జీవిత చరిత్ర ఆధారంగా ఆయన కుమారుడు జగన్ రచించిన ‘ఎగరేసిన ఎర్రజెండా’ పుస్తకాన్ని గురువారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బి.వెంకట్ మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీల విభజన అనంతరం టీవీఆర్ చంద్రం సీపీఐ(ఎం) పక్షాన నిబద్ధతతో నిలిచి, భద్రాచలం నియోజకవర్గంలో పార్టీ నిర్మాణానికి విశేష కృషి చేశారని గుర్తుచేశారు. అమరవీరులు, ఉద్యమ నాయకుల జీవిత చరిత్రలను పుస్తకాల రూపంలో నేటి తరానికి అందించడం అభినందనీయమన్నారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బండారు రవికుమార్ మాట్లాడుతూ.. ఆదివాసీలు, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన అమరవీరుల చరిత్రను ఎవరూ చెరిపివేయలేరన్నారు. భద్రాచలం ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి టీవీఆర్ చంద్రం వంటి నాయకుల సేవలు కీలకమని పేర్కొన్నారు.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిస్వార్థంగా పనిచేసిన చంద్రం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి షబ్బీర్ పాషా మాట్లాడుతూ.. భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో వామపక్ష ఉద్యమం కీలక పాత్ర పోషించిందన్నారు.
కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ఎలమంచి రవికుమార్, చిటూరు వెంకట్రావు, ఏజే రమేష్, పోటు రంగారావు, ముర రమేష్, ఎంబీ నర్సారెడ్డి తదితర నాయకులు, టీవీఆర్ చంద్రం కుటుంబ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










