చిన్నమిడిసిలేరు పాఠశాలలో ‘బడిబాట’ ర్యాలీ .

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండల పరిధిలోని ఎంపీపీఎస్ చిన్నమిడిసిలేరు పాఠశాలలో రాబోయే 2026–2027 విద్యా సంవత్సరానికి ముందుగా విద్యార్థుల చేరికలను పెంపొందించేందుకు ‘బడిబాట’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని బడి ఈడు పిల్లలను గుర్తించి, వారిని పాఠశాలలో చేర్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం ఎస్‌ఎస్‌ఎస్ రవికుమార్ తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్‌ఎస్‌ఎస్ రవికుమార్ పాఠశాల ఉపాధ్యాయులు రజనీ, చంద్రకళ, వెంకటేశ్వర్లు మరియు విద్యార్థులు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు.  నినాదాలతో కూడిన ప్లకార్డులు పట్టుకుని “ప్రతి పిల్లవాడు పాఠశాలకు – విద్యతోనే భవిష్యత్తు”, “బడి బాటలో ముందడుగు – ఉజ్వల భవిష్యత్తుకు పునాది” వంటి సందేశాలను ప్రజలకు తెలియజేశారు.

గ్రామస్తులకు విద్య ప్రాముఖ్యతను వివరించి, తమ పిల్లలను  ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లు, మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలను వివరించారు.

పిల్లల భవిష్యత్తు అభివృద్ధి కోసం తల్లిదండ్రులు చైతన్యంతో ముందుకు రావాలని, ఒక్క పిల్లవాడు కూడా విద్యకు దూరం కాకూడదని ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు.

ఈ ‘బడిబాట’ కార్యక్రమానికి గ్రామ ప్రజలు సానుకూలంగా స్పందించగా, రాబోయే విద్యా సంవత్సరంలో విద్యార్థుల చేరికలు మరింత పెరుగుతాయని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్