భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశం ఉత్సాహభరితంగా జరిగింది. స్థానిక నాయకుడు విజయకుమార్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు చీమలమర్రి మురళి ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా చీమలమర్రి మురళి మాట్లాడుతూ, ఏ ఎన్నికలైనా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని, కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త కంకణబద్ధులై పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల కోసం నిజాయితీగా, నిబద్ధతతో పని చేసే కార్యకర్తలే పార్టీకి అసలు బలమని పేర్కొన్నారు. పదవులు ఆశించకుండా పార్టీ కోసం పనిచేసిన తనకు బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతతో మరింత కష్టపడి పని చేస్తానని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని, పేదల సొంత ఇల్లు కలను నిజం చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.
అదేవిధంగా, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వెంకట్రావు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నారని ప్రశంసించారు. గత ప్రభుత్వాల కంటే భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం ప్రజల అవసరాలను గుర్తించి చర్యలు తీసుకుంటోందని అన్నారు. ముఖ్యంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ద్వారా పేదల ఆకలి తీరుస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదేనని పేర్కొన్నారు.
రానున్న పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించేందుకు ప్రతి కార్యకర్త గ్రామ స్థాయి నుంచి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని మరింత బలపరచాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పోలిన లంక రాజు, పొట్రు బ్రాహ్మానంద రెడ్డి, గుండేపూడి భాస్కర రావు, ఇర్పా వసంత్, తాటి రామకృష్ణ తదితర నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.










