నేటిసూర్య ప్రతినిధి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ప్రతి ఆదివారం నిర్వహించే సంతలో చిరు వ్యాపారులు, వీథి వ్యాపారస్తులు ఎండ తాపానికి విలవిలాడుతూ, కనీసం నిలువ నీడకు కూడా నోచుకోక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. మండుతున్న ఎండలో గంటల తరబడి వ్యాపారం చేస్తూ జీవనోపాధి కొనసాగిస్తున్న వీరి పరిస్థితి కడుసోచనీయంగా మారింది.
ఈ సమస్యను గమనించిన “మీకోసం మేమున్నాం” టీం సభ్యులు వెంటనే స్పందించి, వృద్ధ మహిళా వ్యాపారులకు ఉపశమనం కలిగించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 50 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళా వ్యాపారులకు నీడ కల్పించాలనే లక్ష్యంతో 7 అడుగుల వెడల్పు గల గొడుగులను ఉచితంగా అందజేయాలని నిర్ణయించారు.
ఈ మేరకు ఒక్కో గొడుగు ధర రూ.700గా నిర్ణయించి, దాతల సహకారంతో ఫండ్ రైజింగ్ కార్యక్రమం నిర్వహించారు. సేకరించిన నిధులతో రెండవ విడతగా తెప్పించిన 12 గొడుగులను ఆదివారం నాడు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా “మీకోసం మేమున్నాం” టీం ఛైర్మన్ లయన్ నీలి ప్రకాష్ మాట్లాడుతూ, గత 8 సంవత్సరాలుగా సంస్థ చర్ల మండల ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తూ ముందంజలో ఉందన్నారు. ఇప్పటివరకు దాతల సహకారంతో సుమారు ఒక కోటి రూపాయల నిధులను సేకరించి, దాదాపు 1,80,000 మంది లబ్ధిదారులకు వివిధ సేవా కార్యక్రమాల ద్వారా సహాయం అందించామని తెలిపారు. ప్రస్తుతం సంతలో వ్యాపారం చేసే చిరు వ్యాపారులకు ఈ గొడుగుల పంపిణీ ద్వారా ఉపశమనం కలిగిస్తున్నామని పేర్కొన్నారు.
మిగిలిన వ్యాపారులకు కూడా రాబోయే సంతల్లో మరిన్ని గొడుగులను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతి సేవా కార్యక్రమానికి అండగా నిలుస్తున్న దాతలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దొడ్డి సూరిబాబు, చింతా రామ్మోహన్ మాష్టారు, బీవీ ప్రసాద్, అభిషిక్తుని ప్రేమ్ కుమార్, చింతలపాటి అశోక్, కొమ్మినేని నాగేశ్వరరావు, దొడ్డి తాతారావు, కుప్పాల సౌజన్య, రేగల్ల సుధాకర్, బేతా సతీష్, కుంట సంగ్రామ్ తదితరులు పాల్గొన్నారు.
చిరు వ్యాపారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ కార్యక్రమం స్థానికంగా ప్రశంసలు అందుకుంటూ, సామాజిక సేవకు ఒక మంచి ఉదాహరణగా నిలిచింది.










