భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కలివేరు గ్రామంలో ఉన్న బస్టాండ్ ఎన్నో సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురై నిరుపయోగంగా మారిన విషయం తెలిసిందే. దీని కారణంగా గ్రామ ప్రజలు, ముఖ్యంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండాకాలం తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బస్సుల కోసం వచ్చే ప్రయాణికులు ఎక్కడ నిలవాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
బస్టాండ్ పరిసరాలు చెత్తతో నిండిపోవడం, మొక్కలు పెరిగిపోవడం, కూర్చునే సదుపాయాలు లేకపోవడం వల్ల ప్రయాణికులు ఎండలోనే నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పలుమార్లు స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదు.
ఈ నేపథ్యంలో పరిస్థితిని గమనించిన ఆర్టీసీ అధికారులు స్పందించి, శుక్రవారం కలివేరు బస్టాండ్‌లో శుభ్రపరిచే పనులను ప్రారంభించారు. చెత్తను తొలగించడం, పెరిగిన పొదలను తొలగించడం వంటి పనులు చేపట్టారు. దీంతో గ్రామ ప్రజలు కొంత ఊరట వ్యక్తం చేస్తున్నారు.
అయితే, కేవలం శుభ్రపరిచే పనులతో సరిపెట్టకుండా బస్టాండ్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, ప్రయాణికులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు. కూర్చునే బెంచీలు, తాగునీటి సదుపాయం, షెడ్డు మరమ్మత్తులు వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు ప్రారంభించడం పట్ల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూనే, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఆశిస్తున్నారు











