భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్లలో ప్రతీవారం నిర్వహించే ఆదివారం సంతలో చిరు వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తాజాగా వెలుగులోకి వచ్చాయి. మండుతున్న ఎండల కారణంగా సంతలో వ్యాపారం చేసుకుంటున్న చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ, నిలువ నీడ కూడా లేక విలవిలాడుతున్న దృశ్యాలు ‘మీకోసం మేమున్నాం’ టీం సభ్యుల దృష్టికి వచ్చాయి.
ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు టీం సభ్యులు ముందుకు వచ్చి, ముఖ్యంగా 50 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళా వ్యాపారులకు సహాయంగా 7 అడుగుల వెడల్పు గల నీడ గొడుగులను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఒక్కో గొడుగు ధర రూ.700గా నిర్ణయించి ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ పిలుపుకు స్పందించి ముందుకు వచ్చిన దాతలకు టీం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. వారి సహకారంతో మొదటి విడతగా తెప్పించిన 8 గొడుగులను ఈ రోజు (మార్చి 29, 2026) ఆదివారం లబ్ధిదారులకు అందజేయనున్నారు.
ఈ సందర్భంగా ఇప్పటికే విరాళాలు ప్రకటించిన దాతలు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకుని సహాయాన్ని అందించాలని టీం సభ్యులు విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ సేవా కార్యక్రమానికి దాతలు హాజరై మహిళా వ్యాపారులకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు.
విరాళాలను గూగుల్ పే/ఫోన్ పే ద్వారా 9490518587 నంబర్‌కు (ఎల్‌ఎన్ ప్రకాష్ నీలి) పంపవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా చిరు వ్యాపారులకు కొంతమేర ఉపశమనం కలగనుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.











