భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులు కొత్తపల్లి ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
కార్యక్రమం ప్రారంభంలో కొత్తపల్లి ఆంజనేయులు పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ స్థాపకుడు మహానేత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి నినాదాలతో ప్రాంతాన్ని మార్మోగింది. అనంతరం స్వీట్లు పంచారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నాయకులు కొత్తపల్లి ఆంజనేయులు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు యడారి సత్యనారాయణలు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ చూపిన స్ఫూర్తిదాయక మార్గంలో పార్టీ ముందుకు సాగుతూ, పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కూడా పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎడారిసత్యనారాయణ ,డివిజన్ నాయకులు రేగల్ల సుధాకర్, మండల నాయకులు ఎడ్ల సత్తిబాబు, గారా చంటి ,బాసిబోయిన నాగేశ్వరరావు, పూజారి కొండబాబు, బేత ప్రసాద్ మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చర్లలోజరిగిన ఈ వేడుకలు పార్టీ పట్ల ఉన్న నిబద్ధతను మరోసారి చాటిచెప్పాయి.











