చర్ల కవి తంగెళ్ళపల్లి శంకరాచారి సృజనకు విశేష స్పందన
శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని చర్ల ప్రాంతానికి చెందిన ప్రముఖ కవి, రచయిత తంగెళ్ళపల్లి శంకరాచారి రచించిన భక్తిరసభరిత గీతం భక్తి వాతావరణంలో ఘనంగా ఆవిష్కరించబడింది. ప్రత్యేకమైన సాహిత్యంతో, హృద్యమైన స్వరాల సమ్మేళనంతో రూపొందించిన ఈ గీతాన్ని (TSC Channel) యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేయడం విశేషం.
లింగాపురంపాడు (వెంకట్రావుపేట)లోని శ్రీ కోదండ రామాలయం ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి వేదికగా నిలిచింది. వానవాసి కళ్యాణ పరిషత్ సహ మహిళా ప్రముఖ్ శ్రీమతి పెద్దాడ ఆశలత ఆధ్వర్యంలో, ఆలయ ధర్మకర్త ముత్యాల రాణి, ముత్యాల మణి, ముత్యాల నవీన్, అలాగే భక్తులు సాదం లోకానాదం, పరిటాల సంతోష్ చేతుల మీదుగా గీతం ఆవిష్కరణ జరగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కవి తంగెళ్ళపల్లి శంకరాచారి రచించిన ఈ గీతం శ్రీరాముని మహిమను స్ఫూర్తిదాయకంగా ప్రతిబింబిస్తూ, భక్తి భావాలను హృదయానికి హత్తుకునేలా వ్యక్తపరుస్తోంది. మాధుర్యభరితమైన పద ప్రయోగాలు, సులభమైన భావవ్యక్తీకరణ, సంగీతానికి అనుగుణంగా సాగిన ఈ గీతం వినిన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ, “పాటలోని సాహిత్యం ఎంతో అద్భుతంగా ఉండటంతో పాటు, స్వరాల మాధుర్యం మనసును కట్టిపడేస్తోంది. శ్రీరాముని పట్ల భక్తిని మరింత పెంచేలా ఈ గీతం రూపొందింది” అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా విడుదలైన ఈ భక్తిగీతం భక్తుల మధ్య విశేష ఆదరణ పొందుతూ, ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటోంది.ఈ కార్యక్రమంలో అడబాల రామారావు, పూజారి చిన్నక్క, పూజారి కృష్ణ, విజయ్ కుమార్ శర్మ పంతులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాంగణం అంతటా భక్తి భావనలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.











