తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పరాభవ నామ సంవత్సరానికి సంబంధించిన శబ్దార్థ వివరణను తే గడ గ్రామంలోని భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఆలయ అర్చకులు భాను ప్రకాష్ భక్తులకు తెలియజేశారు.
ఈ సందర్భంగా “ఓం శ్రీ మహా గణపతయే నమః” అంటూ ప్రారంబించిన సందేశంలో పరాభవ నామ సంవత్సరానికి ఉన్న ఆధ్యాత్మిక అర్థాన్ని వివరించారు. “పరా” అనగా అమ్మవారు, పరాశక్తి అని, “భవ” అనగా ఆవిర్భావం అని తెలియజేశారు. ప్రకృతి చైతన్య స్వరూపిణి అయిన పరాశక్తి ఆవిర్భావమే ఈ పరాభవ నామ సంవత్సరం యొక్క నిజమైన అర్థమని తెలిపారు.
అలాగే “పరాభవం” అనే పదానికి ఇతర అనర్థాలు అన్వయించుకోవడం సరికాదని, దీనిని పవిత్రమైన శక్తి ఆవిర్భావంగా భావించాలని భక్తులకు సూచించారు. ఈ నూతన సంవత్సరం అందరికీ శుభప్రదంగా ఉండాలని ఆశిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు, ఆశీస్సులు అందజేశారు.
ఈ సందర్భంగా తేగడ గ్రామంలోని అతి పురాతన, మహిమాన్వితమైన భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి వారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తుండడం విశేషంగా నిలిచింది. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ స్వామివారి ఆశీర్వాదాలు పొందుతున్నారు.
ఈ కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకులు శ్రీ యల్లమందల శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించగా, అర్చకులు భాను ప్రకాష్ వేద మంత్రాల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.
చర్ల మండలం పరిధిలోని తేగడ గ్రామంలో జరిగిన ఈ ఉగాది వేడుకలు భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచాయని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. కొత్త సంవత్సరాన్ని సాంప్రదాయబద్ధంగా ఆహ్వానిస్తూ, భక్తులు ఆనందోత్సాహాలతో గడిపారు.











