వినాయక నవరాత్రుల్లో భక్తి భావం వెల్లివిరియాలి. పందిళ్లపల్లి వెంకటేశ్వర్లు

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

మండపాల్లో భక్తి గీతాలు, ప్రవచనాలకే ప్రాధాన్యం ఇవ్వాలి

నిమజ్జనం ఊరేగింపుల్లో డీజే సంస్కృతికి స్వస్తి పలకాలి.

చర్ల, సెప్టెంబర్ 6 (నేటి సూర్య): సనాతన హిందూ ధర్మ సంప్రదాయాలకు ప్రతీకగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలను ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించి, భవిష్యత్ తరాలకు మన సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పాలని పురోహితులు పందిళ్లపల్లి వెంకటేశ్వర్లు కోరారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు కేవలం వినోద కార్యక్రమాలుగా కాకుండా భక్తి, ఆధ్యాత్మికత, సామాజిక ఐక్యతకు వేదికలుగా నిలవాలని ఆయన అన్నారు.

వినాయక చవితి హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ప్రధాన పండుగల్లో ఒకటని , ఆర్థిక స్థితి, కులమత భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గణనాథుడిని భక్తితో కొలుస్తూ గ్రామాలు, పట్టణాలు, కాలనీలు, వీధుల్లో గణేష్ మండపాలను ఏర్పాటు చేసి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు. ఇలాంటి పవిత్రమైన ఉత్సవాల్లో భక్తి భావనకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందన్నారు.

గణేష్ మండపాల్లో ప్రతిరోజూ పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం మైకులు, సౌండ్ బాక్సుల ద్వారా భక్తి గీతాలు, భజనలు, పురాణ ప్రవచనాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రసారం చేయడం ద్వారా భక్తుల్లో దైవభక్తిని పెంపొందించవచ్చని అన్నారు. ఉత్సవాల పేరుతో సినిమా పాటలు, అసభ్యకరమైన లేదా వికృతమైన పాటలను పెద్ద శబ్దాలతో ప్రసారం చేయడం వల్ల పండుగ అసలు ఉద్దేశం దెబ్బతింటుందని అన్నారు.

ముఖ్యంగా గణేష్ నిమజ్జనం సందర్భంగా నిర్వహించే ఊరేగింపుల్లో డీజేలు, భారీ సౌండ్ సిస్టమ్స్‌కు బదులుగా సంప్రదాయ పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలని వెంకటేశ్వర్లు అన్నారు. భజనలు, కోలాటాలు, సంప్రదాయ నృత్యాలు, జానపద కళారూపాలతో నిమజ్జనం ఊరేగింపులను నిర్వహిస్తే భక్తి వాతావరణం మరింత పెరుగుతుందని తెలిపారు.

భారీ శబ్దాలతో డీజేలు ఏర్పాటు చేయడం వల్ల వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని, అదేవిధంగా విద్యార్థుల చదువులు, ప్రజల ప్రశాంతతకు కూడా ఆటంకం కలగవచ్చని తెలిపారు. అందువల్ల ఉత్సవ కమిటీలు బాధ్యతగా వ్యవహరించి శబ్ద కాలుష్యానికి తావులేకుండా ఉత్సవాలను నిర్వహించాలని కోరారు.

గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తి, ఆధ్యాత్మికతతో పాటు సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. గణనాథుడి ఆశీస్సులు అందరికీ లభించేలా ప్రశాంతమైన, పవిత్రమైన వాతావరణంలో పండుగను జరుపుకోవాలని సూచించారు.

ప్రభుత్వ అధికారులు, పోలీసులు కూడా గణేష్ ఉత్సవ కమిటీలకు అవగాహన కల్పించి డీజేలు, అధిక శబ్దాలతో కూడిన సౌండ్ సిస్టమ్స్‌కు బదులుగా సంప్రదాయ భక్తి కార్యక్రమాలను ప్రోత్సహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భక్తిని పెంపొందించేలా వినాయక ఉత్సవాలను నిర్వహించడం ద్వారా రాబోయే తరాలకు మన సనాతన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని కలిగించవచ్చని పందిళ్లపల్లి వెంకటేశ్వర్లు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :

 నోటిఫికేషన్స్