పోలీస్ శాఖ సేవలు అమోఘం : ఎమ్మెల్యే .
చర్ల, నేటిసూర్య న్యూస్ : అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజల సౌకర్యార్ధం మొబైల్ హాస్పిటల్ అంబులెన్స్ సేవలను ప్రారంభించిన ఘనత కేవలం ఒక పోలీసు శాఖకే దక్కుతుందని ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కితాబిచ్చారు. మారుమూల ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఏమైపోతారన్న బాధ, ఆరోగ్య సమస్యలు వచ్చినపుడు అక్కడ ఎక్కడికెళతారనే కలవరింపు మన జిల్లా ఎస్పీ రోహిత్ రాజును ఈ సంక్షేమ పని వైపు తీసుకెళ్లిందని ప్రశంశించారు. శుక్రవారం నాడు చర్ల మండలంలోని చత్తీస్గడ్ రాష్ట్ర సరిహద్దు గ్రామమైన పూసుగుప్పలో మొబైల్ హాస్పిటల్ అంబులెన్స్ సేవలను భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో పాటు, జిల్లా కలెక్టర్ జితేష్.వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజులు ప్రారంభించారు. స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ నిధుల ద్వారా విడుదలైన కోటి రూపాయల వ్యయంతో ఈ మొబైల్ హాస్పటల్ ను నిర్మించారు. చర్ల మండలంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజల సంక్షేమం కోసం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సారథ్యంలో పోలీస్ శాఖ విశేష సేవలను అందిస్తుందన్నారు. పూసుగుప్ప గ్రామ పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా అత్యవసర చికిత్స అవసరమైతే భద్రాచలం, కొత్తగూడెం పట్టణాలకి వెళ్లడానికి ఒకప్పుడు సరైన రహదారి కూడా లేదని, కానీ ఇప్పుడు ఇదే పూసుగుప్ప గ్రామానికి చర్ల నుండి అరగంట వ్యవధిలోనే చేరుకునే విధంగా రహదారిని ఇప్పుడు ఈ హాస్పిటల్ ని ప్రారంభించడంలో చర్ల పోలీసుల కృషి ఎంతగానో ఉందన్నారు. ఆదివాసీ ప్రజల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి సేవలను పరిసర ప్రాంతాల ప్రజలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ… ప్రభుత్వం తరపున అందవలసిన సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు గానీ ఆదివాసీ ప్రజలకు అందజేయడంలో జిల్లా పోలీసుల కృషి అభినందనీయమన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలకు విద్య, వైద్యం, రవాణా వంటి కనీస సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా జిల్లా అధికార యంత్రాంగం పనిచేస్తుందని తెలిపారు. తదనంతరం ఎస్పీ మాట్లాడుతూ… ప్రభుత్వం తరపున పోలీస్ శాఖ ఏజెన్సీ ప్రాంతవాసులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఎలాంటి సమస్యలున్నా సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించడంలో స్థానిక పోలీసు అధికారులు ఎల్లప్పుడూ ఆదీవాసీ ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ తమ తమ ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు వహించాలని సూచించారు. సరిహద్దు చత్తీస్గడ్ రాష్ట్ర గ్రామాలైన రాంపురం, భీమారం గ్రామాల ప్రజలు కూడా ఈ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని ఈ సందర్బంగా తెలిపారు. అనంతరం అంబులెన్స్ వాహన సేవలను ప్రారంభించారు. ఇటీవల పూసుగుప్ప నుండి రాష్ట్ర సరిహద్దు వరకు నూతనంగా నిర్మితమైన బీటి రోడ్డును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, చర్ల ఇన్స్పెక్టర్ రాజు వర్మ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్స్ చెన్నూరి శ్రీనివాస్, ఇ. శ్రీనివాస్, ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు