చర్ల, నేటిసూర్య న్యూస్: విద్యార్దులు తమకు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకొని ఉన్నత స్దితికి చేరుకోవాలని మండల వ్యవసాయ అదికారి మహ్మద్ అఫ్రిద్ అన్నారు. తన స్నేహితులు ఇరసవడ్ల సతీష్, బేతా ప్రతాప్, గుర్రం కిరణ్ ల జన్మదినం సందర్భంగా సోమవారం చర్ల లోని వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యానిలయంకు 25 కేజీల బియ్యం, భోజనం, స్వీట్స్ అందచేసారు. ఈ సందర్భంగా ఏఈవో అఫ్రిద్ విద్యార్దులను ఉద్దేసించి ప్రసంగించారు. మారుమూల గ్రామాలలో పుట్టి పెరిగిన విద్యార్దులకు వనవాసీ సంస్ద వసతిగృహం ఏర్పాటు చేసి విద్య నందించడం ఆనందకరమని అన్నారు. మరో వైపు దాతలు సైతం మీ అవసరాలను గుర్తించి వితరణలను అందిస్తున్నారని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు మీ భవిష్యత్ కొరకు చేస్తున్నారన్న విషయాన్ని గుర్తెరిగి సద్వినియోగపరుచుకోవాలని పేర్కొన్నారు. వనవాసీ విద్యార్దులు క్రమ శిక్షణకు మారు పేరని, ఈ పేరును నిలబెట్టేలా మెలగాలని అన్నారు. పట్టుదలతో చదివి ఉన్నత స్దితికి చేరుకోవడం ద్వారా తల్లిదండ్రుల కళలను నెరవేర్చాలని ఆకాంక్షించారు. పట్టుదలతో ఏపని చేసినా విజయం సాదిస్తామని ఈ సూత్రాన్ని గమనంలో ఉంచుకొని చదువుకోవాలని విజ్ఞప్తి చేసారు. దాతలను వనవాసీ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియచేసారు. కార్యక్రమంలో వనవాసీ నిలయ ఉపాద్యక్షులు జవ్వాది మురళీకృష్ణ, నిలయ ప్రముఖ్ గొంది పసన్న కుమారి, ముదిగొండ సతీష్, ప్రతాప్, సతీష్, కిరణ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
