ప్రజల ఆరోగ్యాన్ని హాని తలపెట్టే పంటలు కాకుండా ఆర్గానిక్ సేంద్రీయ ఎరువులతో పండించిన పంటలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అటువంటి పంటలు పండించే విధంగా ఆదివాసి గిరిజన రైతులకు సాగులో మెలకువలు సూచనలు సలహాలు అందించాలని అభ్యుదయ రైతు లక్ష్మారెడ్డి ని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అభినందించారు. బుధవారం బూర్గంపాడు మండలం గుట్ట లక్ష్మీపురం గ్రామంలోని అభ్యుదయ రైతు సేంద్రీయ ఎరువులతో సాగు చేస్తున్న పుచ్చకాయల పంట, మిరప పంట, జామకాయ పంటలను ఆయన పరిశీలించారు. పంటలు సాగు చేస్తున్న విధానాన్ని యాజమాన్య పద్ధతుల గురించి రైతును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజన రైతులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందడానికి ఆర్గానిక్ పంటలు వేసుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చని అన్నారు. అభ్యుదయ పామాయిల్ మొక్కలు పెంచుతూ అంతర్ పంటలుగా రైతు సాగు చేస్తున్న పుచ్చకాయ పంట మరియు మిరప సాగు చేస్తున్న విధానం చాలా బాగుందని అన్నారు. 20 లక్షల ఖర్చుతో 20 ఎకరాలలో పుచ్చకాయ పంట సాగు చేస్తున్నానని, ఎకరానికి అసాధారణమైన పుచ్చకాయ దిగుబడి వస్తుందని, కలకత్తా వారు అందించే ఈ మ్యాక్స్ విత్తనం ద్వారా ఈ పంట సాగు చేస్తున్నానని మార్కెటింగ్ సౌకర్యం కూడా కలకత్తా వారే కొనుగోలు చేస్తారని, 70 రోజులలో జాగ్రత్తగా కాపాడుకుంటే పంట చేతికి వస్తుందని, ఎకరానికి 25 టన్నుల పుచ్చకాయ దిగుబడి వస్తుందని అలాగే పొన్నుస్వామి సేంద్రియ ఎరువులతో పండించే మిరప తోట నాలుగు ఎకరాల వరకు చేస్తున్నానని ఎకరానికి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని పిఓకి తెలిపారు.ఎటువంటి హానికరం లేకుండా ఆరోగ్యకరమైన పంటలు పండిస్తున్న లక్ష్మారెడ్డిని గిరిజన రైతులు ఆదర్శంగా తీసుకొని సేంద్రియ పంటలపై దృష్టి సారించాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఏడి అగ్రికల్చర్ ఉదయ భాస్కర్, హార్టికల్చర్ అధికారి వేణుమాధవ్ మరియు తదితరులు పాల్గొన్నారు.
