మాల్దీవులకు చైనా నీటి సాయం.. టిబెట్‌ నుంచి 1500 టన్నుల నీరు చేరవేసిన డ్రాగన్‌

Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

భారత్‌తో వివాదం తర్వాత మాల్దీవులకు చైనా మరింత దగ్గరైంది. మాల్దీవులకు అన్నివిధాలా సాయం చేసేందుకు డ్రాగన్‌ కంట్రీ సిద్ధమైంది. తాజాగా మాల్దీవుల్లో నీటి కొరత ఏర్పడింది.

దీంతో ఆ దేశానికి 1500 టన్నుల తాగునీరును చైనా అందజేసింది. చైనా ఆధీనంలో ఉన్న టిబెట్‌లోని హిమనీ నదాల నుంచి చైనా వీటిని సేకరించి మాల్దీవులకు పంపించింది. టిబెట్‌ అటానమస్‌ రీజియన్‌ ఛైర్మన్‌ యాన్‌ జిన్హాయ్‌ మాల్దీవుల్లో గతేడాది నవంబరులో పర్యటించిప సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజ్జును కలిశారని, తాగునీటి కొరతను అధిగమించేందుకు సాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

అంతేకాకుండా మాల్దీవులకు బహుళ రంగాలలో సహాయం చేస్తానని చైనా హామీ ఇచ్చింది. మొహమ్మద్ ముయిజ్జు నవంబర్ 2023లో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి చైనాతో కలుపుగోలుగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఇరు దేశాలు పరస్పర సహకార మంత్రం జపిస్తున్నాయి. ఇప్పటికే మాల్దీవులతో చైనా సైనిక ఒప్పందం కుదుర్చుకుంది. డిప్యూటీ డైరెక్టర్ మేజర్ జనరల్ జాంగ్ బావోకున్‌ను కలిసిన వెంటనే బీజింగ్‌తో కొత్తగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం చైనా నుంచి తమ దేశానికి చైనా బాష్ప వాయుగోళాలు, పెప్పర్‌ స్ప్రే వంటి అస్త్రాలను ఉచితంగా అందిస్తోందని, అలాగే సైనిక శిక్షణ ఇస్తుందని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు వెల్లడించారు. ఇక తాజాగా తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా పంపిన నీటితో తమ దేశంలో తాగునీటి కొరతను అధిగమించవచ్చని ఆయన పేర్కొన్నారు.

మాల్దీవులకు నీటి కష్టాలు రావడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఎన్నో సార్లు తాగునీటి కొరత ఏర్పడగా పొరుగున ఉన్న దేశాలు తాగునీటిని అందించాయి. డిసెంబరు 4, 2014న మేల్ వాటర్ అండ్ సీవరేజ్ కంపెనీ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించగా ఆ సమయంలో భారత్‌ ‘ఆపరేషన్ నీర్’ పేరిట 375 టన్నుల నీటిని అందించింది. భారత్ నుంచి బహుళ విమానాల్లో నీటిని సరఫరా చేసింది. రెండు భారతీయ నౌకల్లో సుమారు 2000 టన్నుల నీటిని సరఫరా చేసింది. మాల్దీవులు భారత్‌కు సమీపంలో ఉన్న దీవుల సముదాయం. లక్షద్వీప్‌లోని మినికాయ్ ద్వీపం నుంచి కేవలం 70 నాటికల్ మైళ్లు, భారత్ నుంచి 300 నాటికల్ మైళ్ల దూరంలో ఉండటంతో ఎన్నోసార్లు మాల్దీవులను భారత్ ఆదుకుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :

 నోటిఫికేషన్స్