గుండె చికిత్స కోసం విరాళాల సేకరణ – రూ.50,200 సహాయం అందజేత
నేటిసూర్య ప్రతినిధి : కష్టకాలంలో సహచరులకు అండగా నిలవడం మానవత్వానికి నిదర్శనం అని కొత్తదంతెనం గ్రామ యువత చాటిచెప్పింది. కొత్తదంతెనం గ్రామ పంచాయతీ కార్యదర్శి బేక్కంటి మాధవి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం భారీ ఖర్చు అవసరమవుతున్న నేపథ్యంలో గ్రామ యువత ముందుకు వచ్చి సహాయనిధి సేకరించారు.
మాధవికి గుండె చికిత్స కోసం సుమారు రూ.20 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని తెలిసిన కొత్తదంతెనం పంచాయతీ యువత, గ్రామస్తులు కలిసి ఆమెకు అండగా నిలవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో కొత్తదంతెనం మరియు సీతారాంపురం గ్రామాల ప్రజల వద్ద నుంచి విరాళాలు మొత్తం రూ.41,200 సేకరించారు.
ఇదే సమయంలో ఇంచార్జి కార్యదర్శి సాయి కృష్ణ గారు వ్యక్తిగతంగా రూ.9,000 సహాయం అందించారు. ఈ విధంగా మొత్తం రూ.50,200 నిధిని సమీకరించి మాధవి చికిత్స కోసం అందజేశారు.
ఈ సహాయ నిధిని కొత్తదంతెనం పంచాయతీ సర్పంచ్ పొడియం సుబ్బారావు, ఉపసర్పంచ్ అనిత, మాజీ జడ్పీటీసీ అన్నే సత్యనారాయణ మూర్తి, ఇంచార్జి కార్యదర్శి సాయి కృష్ణల చేతుల మీదుగా ఎంపీడీఓ వివేక్ రామ్ కి అందజేశారు.
ఈ సందర్భంగా అన్నే సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ కష్టాల్లో ఉన్నవారికి చేయూతనివ్వడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని తెలిపారు. గ్రామ యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయనిధి సేకరించడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామస్థుల ఐక్యతతో ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కొత్తదంతెనం పంచాయతీ యువత సభ్యులు మోతుకూరి శ్రీకాంత్, మారెళ్ల వెంకటనారాయణ, వందవాసు రాము, సిద్ది మహేష్, కారంపూడి శ్రీను, పూజారి సందీప్, బొమ్మిడి హనుమంత్, కొత్త అచ్చుతరావు, కొత్త నర్సింహరావు, జల్లవరపు చలమయ్య, అల్లాడి సజీవ్, బొల్లోజు బాలమురళి, కొత్త ఏసుదాసు, వీవోఏ కొత్త వెంకటనర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.










