భద్రాచలంలో ఆశీలు తప్పు… పర్ణశాలలో ఒప్పా…!?
అంతుచిక్కని ద్వంద్వ నీతి
నిద్రావస్థలో సంబంధిత అధికారులు.
నేటిసూర్య ప్రతినిధి:
దక్షిణ అయోధ్య అని పిలువబడే భద్రాచలంలోని శ్రీ సీతారామ స్వామి వారిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్త జన సమూహం తరలివస్తూ ఉంటుంది. ఇదొక నిరంతర ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. కానీ అలాంటి భక్తులకు అడుగడుగునా మోసాలు, అగచాట్లు ఎదుర్కొవాల్సి వస్తోంది. ప్రతి ఒక్కరూ డబ్బున్న వారే ఉండరు కదా… అందులో కొందరు కొన్ని సంవత్సరాల నుంచి ప్రణాళిక రూపొందించుకొని డబ్బు కూడబెట్టుకొని మిడిల్ క్లాస్ కుటుంబాలు స్వామి వారి దర్శనానికి వస్తుంటారు. అలాంటి వారి నుంచి ఆదిలోనే హంసపాదులా పర్ణశాల ఎంట్రన్స్ లో ఆశీలు రూపేణా కొంత మొత్తం చెల్లించి ప్రవేశించాల్సి ఉంది. కానీ ఇక్కడి కాంట్రాక్టర్లు ఆశీలు రశీదును బదలాయించి దానిపై అధిక ధరలతో సొమ్ములు కాజేస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా సంబంధిత అధికారులు కానీ… అటువైపు వచ్చే ఏ ఇతర అధికారులకు ఎందుకింత వసూలు చేస్తున్నారనే ధైర్యం చేయలేకపోవడం సిగ్గుచేటుగా ఉందని పలువురు ప్రశ్నిస్తున్నారు. పర్ణశాలలో ఆశీలు దందా మూడు పూలు ఆరు కాయలుగా యథేచ్ఛగా కొనసాగుతోంది. శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోవడానికి పర్ణశాల వచ్చే భక్తులకు పర్ణశాల గ్రామ ప్రవేశ ద్వారంలోని ఆశీలు రూపంలో దందా జరుగుతుంది. భద్రాచలంలో కనిపించే ఆశీలు దందా, పర్ణశాలలో కనిపించకపోవడం విడ్డూరంగా ఉంది. పర్ణశాలలో ఎక్కడ కూడా ఆశీలుకు సంబంధించి రేట్ల పట్టిక ఎక్కడా కనిపించదు. వారు ఇచ్చే రశీదుపై సర్పంచ్ లేదా గ్రామ పంచాయతీ అధికారి సంతకం ఉండదు. వాళ్లు ఎంత ఇస్తే నోరు మూసుకొని అంతేచెల్లించి వెళ్లాల్సిందే. భద్రాచలంలో జరిగితే తప్ప… మరి పర్ణశాలలో జరిగే ఆశీలు దందా అందరికీ ఎందుకు కనిపించదు.. అక్కడ పాట పాడుకున్నది పలుకుబడి ఉన్న వారనా… ఇంత జరుగుతున్నా అధికారులు కనీనం చర్యలు తీసుకోలేకపోవడం వెనుక మతలబేంటో మరి అర్ధంకాని పరిస్థితి నెలకొంది. తక్షణమే పర్ణశాల గ్రామం మొత్తం ఆశీలు పట్టిక బోర్డులు ఏర్పాటు చేయాలని, వారు ఇచ్చే రశీదులపై అధికారులు నిఘా పెట్టాలని వచ్చీపోయే యాత్రికులు, భక్తులు వేడుకుంటున్నారు.