బూర్గంపాడు, నేటిసూర్య న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం జింకల గూడెం గ్రామంలో అక్రమంగా గోవులను తరలించే లారీని అడ్డుకోబోయిన బిజెపి మండల అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ మరియు మరో కార్యకర్తపై జింకల గూడెం గ్రామానికి చెందిన కొంతమంది మైనార్టీలు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచి చంపుటకు ప్రయత్నించారని బిజెపి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు .
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో ఉన్న బిజెపి కార్యాలయంలో బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బూర్గంపాడు మండలంలో విచ్చలవిడిగా గోవుల వ్యాపారం నిర్వహిస్తుంటే ప్రశ్నించిన మండల అధ్యక్షుడు పై విచక్షణారహితంగా కొట్టి గాయపరచడం సమంజసం కాదని అన్నారు. న్యాయపరంగా అన్ని హక్కులు ఉంటే దొంగ చాటుగా గోవులను ఎందుకు తీసుకెళ్తున్నారో ప్రజలకు చెప్పాలని తెలిపారు. మండలంలో కొంతమంది వ్యక్తులు మాఫియాగా ఏర్పడి గోవులను సరఫరా చేస్తున్నారని ఇటువంటి వాటిని ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు .తమ పార్టీ మండల అధ్యక్షుడు పై మరియు మరో వ్యక్తిపై దాడి చేసిన సదరు వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకొని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .లేని యెడల తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని ఈ సంఘటనను ఎంతవరకైనా తీసుకెళ్లడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు అధికారులు పక్షపాత వైఖరితో పనిచేయాలని , ఆ కుటుంబాలకు న్యాయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. సాయి శ్రీనివాస్ కుటుంబానికి మరియు కార్యకర్త కుటుంబానికి తమ పార్టీ తరఫున అండదండలు అందిస్తామని న్యాయం జరిగే వరకూ పోరాడుతామని అన్నారు. వెంటనే దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని లేనియెడల చర్యలకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో బిజెపి కిషన్ మోర్చా రాష్ట్ర నాయకులు ఏనుగుల వెంకటరెడ్డి, జిల్లా నాయకులు ప్రసాద్ రావు, బిజ్జం శ్రీనివాస్ రెడ్డి, బాలు నాయక్, బాలాజీ, సురేష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు