పోలవరం ముంపు బాధిత గ్రామాలకు న్యాయం చేయండి.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేత.
బూర్గంపాడు ,నేటిసూర్య న్యూస్: రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటనలో భాగంగా బూర్గంపహాడ్ వచ్చిన సందర్భంగా గోదావరి ముంపు బాధిత గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపించాలని బూర్గంపహాడ్ వైపు గోదావరి సరిహద్దు ప్రాంతంలో కరకట్టలు నిర్మించాలని కే.వి రమణ , భూపల్లి నరసిం హారావు, గూడూరి వెంకన్నలు వినతి పత్రం అందజేశారు. బూర్గంపహాడ్ మండలంలో ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా గోదావరి ముంపు తీవ్రత పెరిగిందని వర్షం పడుతుందంటే రైతులు రైతు కూలీలు వ్యాపారస్తులు సాధారణ ప్రజానీకం వరద భయంతో గజగజ వనికే పరిస్థితి దాపురించిందని విచారం వ్యక్తం చేశారు . గోదావరి ముంపు తీవ్రత నుండి శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతూ గతంలో రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో 2013 భూ సేకరణ చట్టాన్ని అనుసరించి ముంపు బాధిత ప్రాంత ప్రజలకు సమగ్ర పరిహారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పి పి ఏ )నుండి ఇప్పించాలని , ఎత్తైన ప్రాంతాలలో పక్కా గృహాలు నిర్మించి తద్వారా శాశ్వత పరిష్కారం చూపించాలని పలు డిమాండ్ తో వినతి పత్రంలో పొందుపర్చారు. బూర్గంపాడు మండల కేంద్రంలో 2022 ఆగస్టు 19 నుండి 53 రోజులు కుల మతాలు రాజకీయా పార్టీలకతీతంగా రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగిందని మంత్రికి వివరిస్తూ ఆ సందర్భంలో తమరు దీక్షా శిబిరాన్ని సందర్శించి మీకు అండగా ఉంటానని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులతో మాట్లాడి బాధితులకు పూర్తి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని కావున న్యాయం చేయాలని వేడుకోవడం జరిగింది .అదేవిధంగా మండలంలో గోదావరి సరిహద్దు ప్రాంతం వెంబడి వరద తీవ్రత నుండి రక్షణగా కరకట్టలు నిర్మించాలని విజ్ఞప్తి చేశామని తెలియజేశారు. ఇరుగు ఈశ్వరరావు , హరి ప్రసాద్ , లక్కోజు విష్ణు తదితరులు ఉన్నారు.