భయం వీడారు… బరిలోకి దిగారు… ఆట అదుర్స్
పోలీసుల ప్రోత్సాహం… సహకారం… మాకెంతో ఉత్తేజాన్ని నింపింది… క్రీడాకారులు
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కనీస సౌకర్యాలను అదించడమే లక్ష్యం : జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.
చత్తీస్గడ్ రాష్ట్రం నుండి మొదటిసారి వాలీబాల్ టోర్నమెంట్లో క్రీడాకారులు
చర్ల నేటిసూర్య న్యూస్ : కొన్ని దశాబ్దాల నుంచి మన్యంలోనే తమ జీవితాలను గడుపుకుంటూ… బతుకు జీవుడా అంటూ కాలం వెళ్లదీసిన ఆదివానులకు పోలీనుల ప్రోత్సాహం, సహకారం ఎంతో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపినట్లయింది.. వారి మోముల్లో ఎన్నో ఏళ్ల నుంచి దాగి ఉన్న భయం మటుమాయమైందని సంబుర పడ్డారు ఆ మన్యం ప్రజలు. అడుగడుగునా బాంబు మోతలు, డిటోనేటర్లు, మందు పాతరలు పేలి ఎందరో అమాయకులు బలయ్యారని, అలాంటి వారికి అభయ హస్తమందించి వారిలో కూడా ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుందని పోలీసులు గ్రహించారు. ఇంకేముంది జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఇచ్చిన పిలుపు మేరకు చర్లలో వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఈ పోటీలు ఈ నెల 5వ తేదీన మండల స్థాయి వర కే ప్రారంభమవగా… పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని కొన్ని కుగ్రామాల ప్రజలు మేము సైతం పాలుపంచుకుంటామని ముందుకొచ్చారు చెప్పేదేముంది ఆట అదుర్స్. వాలీబాల్ కోర్టులోకి బుల్లెట్ వేగంతో దూసుకొచ్చారు. పోలీసుల లక్ష్యం నూటికి 200 శాతం సక్సెస్ అని పోలీనుల మోముల్లో చిరునవ్వులు వెల్లువిరిసాయి. వివరాల్లోకి వెళ్లితే… చర్ల పోలీసుల ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన మొదలయిన మండల స్థాయి వాలీబాల్ పోటీలు శుక్రవారం ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పాల్గొన్నారు. ఎస్పీతోపాటు భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ కూడా పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ మండల స్థాయి వాలీబాల్ పోటీలకు తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన ఏజెన్సీ గ్రామాల నుండి వాలీబాల్ జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో మొత్తం 56 టీమ్ లు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ అధికారులు, సిబ్బంది స్థానిక ప్రజలు ఉత్కంఠభరితంగా సుందరయ్య కాలనీ, పెద్ద ఉట్లపల్లి జట్ల మధ్య సాగిన మ్యాచ్ ను ఆసక్తితో తిలకించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపిఎస్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల నుండి యువత క్రీడల్లో జాతీయస్థాయి వరకు చేరుకొని ఈ ప్రాంతానికి, జిల్లాకి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆశించారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమమే జిల్లా పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలియజేశారు. ప్రధానంగా విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలను ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు అందేలా కృషిచేస్తూ వారికి మరింత చేరువయ్యేలా పోలీసు శాఖ తరపున అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగానే ఈ క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ వాలీబాల్ టోర్నమెంట్లో పాల్గొని విజేతలుగా నిలిచిన జట్లకు అభినందనలు తెలియజేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో క్రీడల పట్ల ఆసక్తి మక్కువ ఉన్న క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకునేందుకు పోలీసులు శాఖ తరపున ఏర్పాటు చేస్తున్న ఇలాంటి క్రీడా పోటీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ-చత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే యువకులు అధిక సంఖ్యలో ఈ పోటీల్లో పాల్గొనడం చాలా ఆనందకరంగా ఉందని తెలిపారు. నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ నాయకులు ఆదివాసీ ప్రజలలో ఆదరణ, సమ్మకం కోల్పోయారని అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ఆదివాసీ ప్రజలకు అండగా ఉంటుందని, నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి ఎలాంటి సహాయ సహకారాలు అందించొద్దని సూచించారు అనంతరం ఈ పోటీల్లో ప్రథమ బహుమతిని గెలుచుకున్న చీమలపాడు ద్వితీయ బహుమతిని గెలుచుకున్న సుందరయ్య కాలనీ, తృతీయ బహుమతిని గెలుచుకున్న పెద్ద ఊట్లపల్లి, నాల్గవ బహుమతిని గెలుచుకున్న మామిడిగూడెం జట్లకు జిల్లా ఎస్పీ తమ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ వాలీబాల్ పోటీలను ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన చర్ల పోలీసులను, సహకరించిన పీడీ, పీఈటీలకు ఎస్పీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ రాజ్ కుమార్, చర్ల సీఐ రాజు వర్మ ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ తదితరులు పాల్గొన్నారు.