సమ్మెతో స్తంభించిన విద్యాబోధన
ప్రభుత్వం స్పందించాలంటూ నినాదాలు
చర్ల, నేటిసూర్య న్యూస్ : నేటి బాలలే భావి భారత పౌరులు అంటూ చాచా నెహ్రు అన్న పదాలు పటాపంచాలయ్యాయా… విఖ్యాత భారతీయ శాస్త్రవేత్తలు సీవీ. రామన్, విక్రమ్ సారాభాయ్, హెూం జహంగీర్ బాబా వంటి ప్రముఖులతో కలిసి శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం అగ్ర రాజ్యాలకు ధీటుగా ఉండాలనే సంకల్పంతో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు బూడిదలో పోసిన పన్నీరయ్యాయా.. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు పునాది వేసేందుకు అహర్నిశలు పడిన కష్టాలు… అలాంటి మహాత్ముల త్యాగాలు బూడిదలో పోసిన పన్నీరులా ఇక్కడ పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అదెలాగో వివరాల్లోకి వెళితే… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో కస్తూర్బా పాఠశాల విద్యార్థుల చదువు అర్థాంతరంగా ఆగిపోయింది. దీనికి మూలకారణం వారి సమస్యల పరిష్కారం కాకపోవడమేనని తెలుస్తోంది. ఎవరో చేసిన పాపానికి మరొకరు శిక్ష అనుభవించినట్లుంది పరిస్థితి ఇక్కడ. అందులో భాగంగా తమకు చదువులు కావాలని, తమ సమయం వృధా అవుతోందని ఆ పాఠశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు సమగ్ర శిక్షా అబియాన్ ఉద్యోగుల సమ్మెతో కస్తూర్బా పాఠశాలలో విద్యాబోధన నిలిచిపోయింది. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు ఈ నెల 10వ తేదీ నుండి సమ్మెకు దిగారు. 17వ రోజుకు చేరిన ఈ సమ్మె ఇంకా కొనసాగుతోందని, దీంతో తమ చదువులు ఆగమాగమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు కస్తూర్బా పాఠశాలలో విధులు నిర్వహించే ఉపాధ్యాయులు, సిబ్బంది సర్వ శిక్షా అభియాన్ కిందకు రావడంతో వీరంతా విధులను బహిష్కరించి గత 17 రోజులుగా జిల్లా కేంద్రమైన కొత్తగూడెం (పాల్వంచ) కలెక్టర్ వద్ద నిర్వహిస్తున్న సమ్మె శిబిరంలో పాల్గొంటున్నారు. దీంతో గత 17 రోజులుగా విద్యాభోదన నిలిచిపోయింది. కేవలం ఇద్దరు డ్యూటీ టీచర్స్ తో విద్యార్థులకు బోధించకుండా వారితో పాఠ్యాంశాలను రివిజన్ చేయించారు. రోజులు గడుస్తున్నా… ప్రభుత్వం సమస్య పరిష్కారంపై దృష్టి సారించకపోవడంతో రేపటి నుండి డ్యూటీ టీచర్స్ సైతం సమ్మెకు దిగనున్నారు. ఫలితంగా పూర్తిస్థాయిలో విద్యాబోధన నిలిచిపోనుంది. ఇప్పటికే ప్రభుత్వం పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున ఉపాధ్యాయుల నమ్మె తమ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన విద్యార్థుల్లో కలుగుతోంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యల పరిష్కార మార్గం చూపి విద్యార్థుల భవిష్యత్తుకు వెలుగులు నింపాలని పలువురు విద్యావంతులు కోరుతున్నారు.











