తొలిసారి వ్యాపార భాగస్వాములుగా మారిన అంబానీ-అదానీ.. పవర్‌ ప్రాజెక్టులో 26% వాటా కొనుగోలు చేసిన రిలయన్స్

Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు, అపర కుబేరులు ముకేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ తొలిసారి వ్యాపార భాగస్వాములు అయ్యారు. గుజరాత్‌కు చెందిన వీరిద్దరి మధ్య కనిపించని పోటీ ఉంటుందనేది నిపుణుల అభిప్రాయం.

సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న వీరిద్దరూ ప్రస్తుతం వ్యాపార రంగంలో చేతులు కలిపారు. దీనిలో భాగంగా అదానీ పవర్‌ లిమిటెడ్‌కు పూర్తి అనుబంధ సంస్థ అయిన పవర్‌ ప్రాజెక్టులో 26 శాతం వాటాను ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసింది. మహాన్‌ ఎనర్జెన్‌లో ఒక్కో షేరు రూ.10 విలువ కలిగిన మొత్తం 5 కోట్ల షేర్లను రిలయన్స్‌ కొనుగోలు చేసింది.

అదే విధంగా మధ్యప్రదేశ్‌లోని ఈ ప్లాంటుకు చెందిన 500 మెగావాట్ల యూనిట్‌లో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను ఆర్‌ఐఎల్‌ సొంత అవసరాలకు 20 ఏళ్ల పాటు వినియోగించుకునేందుకు రెండు సంస్థలు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ మేరకు రిలయన్స్‌ – మహాత్‌ మధ్య ఒప్పందం కుదిరింది. సొంత వినియోగ పాలసీలో భాగంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాన్ని(పీపీఏ) ఎంఈఎల్‌తో కుదుర్చుకున్నట్లు అదానీ పవర్‌ వెల్లడించింది. మొత్తం 2,800 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఎంఈఎల్‌ ప్లాంటులో 600 మెగావాట్ల యూనిట్‌ను సొంత అవసరాలకు వినియోగించనున్నట్లు పేర్కొంది.

కాగా ఇన్నాళ్ల వ్యాపార జీవితంలో అంబానీ, అదానీ ఒకరి వ్యాపారంలో మరొకరు తారసపడిన దాఖలాలు లేవు. అంబానీకి చమురు-గ్యాస్‌ నుంచి టెలికాం దాకా వ్యాపారాలున్నాయి. అదానీకి బొగ్గు తవ్వకం నుంచి విమానాశ్రయాల వరకు వ్యాపార సాంమ్రాజ్యం ఉంది. అయితే వీరిద్దరూ ఒక్క స్వచ్ఛ ఇంధన వ్యాపారంలో మినహా ఏనాడు వ్యాపార రిత్యా చేతులు కలిపింది లేదు. 5జీ స్పెక్ట్రమ్‌ కొనుగోలుకు అదానీ గ్రూప్‌ దరఖాస్తు చేసినప్పటికీ.. పబ్లిక్‌ నెట్‌వర్క్‌ కోసం దానిని ఇప్పటి వరకు వినియోగించలేదు. 2022లో అంబానీతో సంబంధమున్న ఒక కంపెనీ ఎన్‌డీటీవీలో తనకున్న వాటాలను అదానీకి విక్రయించింది. ఇక మార్చి నెల ఆరంభంలో ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ ప్రీవెడ్డింగ్‌ వేడుకలకు అదానీ కూడా హాజరయ్యారు. ఇలా వీరి మధ్య సాన్నిహిత్యానికి తాజా ఒప్పందం బలం చేకూర్చినట్లైంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :

 నోటిఫికేషన్స్